Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

రామాయణం-రాముడి లక్షణాలు

రామాయణం-రాముడి లక్షణాలు

షోడశ కళా ప్రపూర్ణ శ్రీరామచంద్రుడి గుణ గణాలను ఒక్కొక్కటి గా మన గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గారి ద్వారా తెలుసుకుందాము. రాముడి యొక్క గుణగణాలను విశ్లేషించుకుని, దాన్ని ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

మానవ జాతికి మహర్షి వాల్మీకి ఇచ్చినటువంటి సందేశం, ఉత్తమైనటువంటి లక్షణాలు ఎటువంటివి మానవులు పెంపొందించుకోవాలి, తద్వారా మనిషి మహనీయుడుగా ఎదుగగలడు అని మహర్షి వాల్మీకి రామకథ ద్వారా మనకందించారు.

మనకి మానవజీవితములో ఎటువంటి గుణగణాలుంటే అందరూ మెచ్చుకుంటారో, అందరి చేత హర్శింపబడతామో, ఎటువంటి లక్షణాలు ఉంటే మనల్ని అందరూ సంతోషముగా ఆమోదిస్తారో, అటువంటి లక్షణాల్ని మనకి రామాయణములో మహర్షి వాల్మీకి ఒకే ఒక శ్లోకములో అందించారు. మనిషి మహాత్ముడిగా మారాలంటే మనకి ఏ ఏ లక్షణాలు ఉండాలో రామాయణం మనకు నేర్పుతుంది. personality development కోసం ఎవరెవరి దగ్గిరకు వెళాల్సిన అవసరం లేకుండా ఈ పదహారు లక్షణాలు అలవరచుకోండి, మీరు కూడా మహనీయులుగా ఎదగవచ్చు అని వాల్మీకి మహర్షి త్రేతాయుగములోనే ఈ లక్షణాలను మనకందించారు. కానీ మనకి english పేర్లు ఉంటేగాని వాటి మీద నమ్మకం ఉండదు. అది ఈనాటి మన విద్యావ్యవస్థ మనలో తెచ్చిన మార్పు. కానీ విశ్లేషించి చూస్తే రామాయణములో ఈ ఒక్క శ్లోకము గనుక అర్థం చేసుకుంటే, ఉన్నతమైన ప్రమాణాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వముతో మనిషి ఎలా మారగలడో మనకు తెలుస్తుంది.

రామాయణములో రాముడి లక్షణాలు ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ‘రాముడికేమిటండి ఆయన దేవుడు’, అంటుంటారు మనలో చాలా మంది. అయితే రాముడు మానవరూపములోనే తన జీవనాన్ని గడిపాడు. ఒక సందర్బములో దేవతలు రాములవారితో, “రామా నీవు శ్రీమహావిష్ణువు స్వరూపము”, అని పేర్కొంటే తాను భగవంతుడిని కాదని, మానవుడిని అని వారితో పేర్కొంటారు. శ్రీరాములవారికి తాను భగవంతుడిని అని గుర్తు ఉండదు. అందుకు కారణం మానవుడే రావణుడిని సంహరించాలి అనే వరం. మనలో కూడా ఎంత మంది ఆలా పుట్టామో మనకే తెలీదు. కాబట్టి రాముడు ఆచరించిన విధానములో మనము కూడా ఆచరించగలగాలి.

ఎప్పుడో త్రేతాయుగములో జరిగిన రామాయణం. ఇవాల్టికి కూడా రాములవారికి గుడి కట్టి పూజిస్తూ, రాముడి లాంటి కొడుకు ఉండాలి, రాముడి లాంటి అల్లుడు ఉండాలి అనుకుంటున్నారు సమాజములో. ఎందువల్ల అంటే రాముడికి ఉన్న ప్రత్యేక లక్షణాలు. ఈ లక్షణాలన్నీ అలవరచుకోవాలి, సాధన ద్వారా అలవరచుకోవాలి.

రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను వర్ణిస్తూ, మనకి ఏ గుణాలు ఉంటే మనిషి పరిపూర్ణుడు అవుతాడో (షోడశకాలపూర్ణుడు) ఆ గుణాలను వాల్మీకి మహర్షి రామాయణములో మనకందించారు. చంద్రుడికి 16 కళలు ఉంటాయి అంటారు, కానీ నిజానికి ఉన్నవి 15 కళలే, కానీ అమావాస్యను కూడా కలిపి 16 అంటారు. ఈ 16 కళల చంద్రుడు రామచంద్రుడు అనే మనకి రామాయణం ప్రారంభములోనే వాల్మీకి మహర్షి పేర్కొంటారు.

రామాయణములో రెండవ శ్లోకం – వాల్మీకి మహర్షి నారదులవారిని ప్రశ్నించటం.

కోన్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత:

చారిత్రేణ చ కో యుక్తస్సర్వభూతేషు కో హిత:
విద్వాంక్: కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శన్:

ఆత్మవాన్కో జితక్రోధో ​​ద్యుతిమాన్కోథ్యనసూయక:
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే

“ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి”, అని వాల్మీకి మహర్షి నారదులవారిని ప్రశ్నిస్తారు.

కోన్వస్మిన్సామ్ప్రతం లోకే – “ఈ కాలములో, ఈ లోకములో. ఎపుడో సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు అని చెప్పటం కాదు, ఈ కాలములో, మనము ఉన్నటువంటి లోకములో, ఎవరన్నా ఉన్నారా”, అని వాల్మీకి మహర్షి నారదులవారిని ప్రశ్నిస్తారు. అంటే రామాయణం ఎప్పుడో జరిగిపోయిన ఒక కథ కాదు, వాల్మీకి మహర్షి ఉన్న కాలములో జరిగిన కథ, తాను స్వయముగా దర్శించి రచించిన కథ రామాయణం.

వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకు నారదులవారు, “ఉన్నాడయ్యా, రామచంద్రమూర్తి ఉన్నాడయ్యా”, అని చెప్పి వంద శ్లోకాలలో రామాయణాన్ని వర్ణిస్తారు.

రాముడి లక్షణాలు – మొదటిది గుణవాన్

వాల్మీకి మహర్షి నారదులవారిని అడిగిన ప్రశ్నలో ఉన్న 16 లక్షణాలలో మొదటిది ‘గుణవాన్’ అంటే ‘గుణవంతుడైన వాడు ఎవరు’, అని అడిగారు. మొట్టమొదటి లక్షణము కావల్సినది, 16 గుణములలో గొప్పది ఏమిటంటే ‘గుణవాన్’, అంటే గుణవంతుడై ఉండటం. అంటే మంచి గుణాలన్నీ కలిగి ఉండటం. ఏమిటి మంచి అంటే, రామాయణములో రాముడి గుణాల గురించి ఒక్కసారి పరిశీలన చేద్దాము.

రాముడు దశరథమహారాజు కుమారుడు, ఒక చక్రవర్తి యొక్క కుమారుడు. దశరధ మహారాజు కుమారుడు అయిన రామచంద్రమూర్తి అందరిని సమముగా చూస్తూ, అయిన స్నేహితులు ఎవరయ్యా అని చూస్తే, అడవిలో ఉండేటువంటి ఆటవిక జాతికి చెందిన గుహుడు. రాముడికి అత్యంత స్నేహితుడు ఎవడయ్యా అంటే ఆటవిక జాతికి చెందిన గుహుడు. పోనీ అంతటితో ఆగాడా అంటే తరువాత స్నేహం చేసింది వానరజాతివాడిన సుగ్రీవునితో. తాను నరుడై ఉండి, చక్రవర్తి కుమారుడై ఉండి, కోతిమూకతో స్నేహం ఏమిటండి అనిపిస్తుంది మనకి. కానీ ఆయన దృష్టిలో ఆటవికజాతికి చెందినటువంటి గుహుడు, వానర జాతికి చెందిన సుగ్రీవుడు, అందరిని సమానముగా చూసేటటువంటి ద్రుష్టి కలిగినవాడు.

అంతే కాదు రాక్షస జాతికి చెందిన విభిషణుడితో కూడా స్నేహము చేసినవాడు రాముడు. విభిషణుడు రాముడి శరణుకోరి వచ్చినప్పుడు, తన పరివారములో ఉన్న అందరూ కూడా విభిషణుడిని తమ బృందంలో చేర్చుకోవద్దు, ‘అతను రాక్షస జాతికి చెందినవాడు, రావణుడి గూఢచారి’, అన్నా కూడా, విభిషణుడితో మైత్రిని చేసుకున్నవాడు రాముడు. కాబట్టి రాక్షస జాతికి చెందినవాడైనా, తన శత్రువుల వర్గానికి చెందినవాడైనా తన మైత్రి కోరివచ్చిన వారిని ఆదరించినవాడు రాముడు.

అంతే అటు ఎక్కువా, ఇటు తక్కువా లేకుండా, “నేను ఎక్కువ” అనే అహంకారం లేకుండా (ఈ రోజులలో మనం చెప్పుకోవాలంటే ఒక ముఖ్యమంత్రి కుమారుడో, ఒక ప్రధానమంత్రి కుమారుడో) ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడో మనము చూడగలిగితే, సామాన్యులతో వారు స్నేహం చేస్తున్నారా లేదా, ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఆ స్నేహబంధం బలపడుతున్నాడా లేదా, అని గనక మనము గమనించగలిగితే, అటువంటి గుణసంపన్నుడు అన్నారు.

సౌశీల్యానికి గుణము అని పేరు. ఆంటే charecter అంటాము అంగములో మనము. good charecter , that is an asset for a human being అన్నారు. మనిషికి పేరు తెచ్చిపెట్టేది ఏమిటయ్యా ఆంటే తాను సంపాదించిన ధనము కాదు, తాను సంపాదించిన విద్యా కాదు, తన సౌశీల్యాము మాత్రమే. కాబట్టి గుణవాన్.

రాముడి లక్షణాలు – రెండవ లక్షణము – వీర్యవాన్

రెండవ లక్షణము – వీర్యవాన్. వీరత్వము కలిగినటువంటి వాడు ఎవ్వడు?
రాముడి వీరత్వము గురించి విశేషముగా మనకి రామాయణము వర్ణిస్తుంది. ఖర దూషణాదుల ఇత్యాది 14 వేల రాక్షసులను రాముడు ఒక్కడే సంహరిస్తాడు.

సుందరకాండలో హనుమంతులవారు రాములవారి పరాక్రమాన్ని గురించి రావణునికి వివరిస్తూ, “చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె; వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కూలవైచె; అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె;
కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె; అట్టి మహా ధనుర్ధరునకున్ యెగ్గాచరించి, హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయద, నిర్ఘాత, సంఘాత, బాణ ఘాత శాత హతులుగాక బదుకగలరె”, అని పేర్కొంటారు. (భాస్కర రామాయణంలో పద్యం)

“ఓ రావణాసురా! నువ్వు కైలాసాన్ని పెకలించబోయినప్పుడు శివుడు కాలిని అదిమి పట్టి నీ గర్వాన్ని అణచాడే…ఆ శివుడి విల్లును రాముడు అవలీలగా తుంచివేశాడు. నిన్ను తోకతో చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచి తేల్చాడే…ఆ వాలిని రాముడు ఒక్క వేటుతో నేలపడగొట్టాడు. నిన్ను ముప్పుతిప్పలు పెట్టిన కార్తవీర్యార్జునుడిని నిగ్రహించిన పరశురాముడిని రాముడు నిగ్రహించాడు. ఖరదూషణాదులు పద్నాలుగు వేలమందిని రాముడు పద్నాలుగు నిమిషాల్లో మట్టుబెట్టాడు. అలాంటి రాముడు బాణం సంధిస్తే…దానికి హరిహర బ్రహ్మలయినా ఎదురు నిలవగలరా?”, అని ఈ పద్యం యొక్క భావం.

చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె – రాముడంటే ఏమనుకుంటున్నావయ్యా? ఒకనాడు నీవు (రావణుడు) శివపార్వతులను దర్శించటానికి కైలాస పర్వతానికి వెళ్లవు. అప్పుడు శివపార్వతులు ఏకాంతములో ఉన్నందున నీకు ఆ అవకాశం లభించలేదు. అందుకు నీవు కోపించి కైలాస పర్వతాన్ని ఎత్తాలని చూసావు. నీవు చేసిన పనికి కోపించిన శివుడు ‘ఎవడురా కైలాస పర్వతాన్ని ఎత్త సాహసించింది’, అని ఆ పరమేశ్వరుడు శివుడు తన కాలిని అదిమి పట్టి నీ గర్వాన్ని అణిచాడు. శివుడు తన కాలి బొటనువేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అంతటి భగవంతుడైన ఆ పరమశివుడి ధనుస్సుని రాముడు అవలీలగా ఎక్కుపెట్టాడు, అంతే కాదు ఆ ధనస్సును విరిచేసాడు. అది రాములవారంటే. రాములవారి వీరత్వమంటే.

‘వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కూలవైచె’ – వాలి ఒకనాడు సంధ్యావందనం ఆచరిస్తూ ఉండగా, నీవు (రావణుడు) వాలిని యుద్దానికి ప్రేరేపించగా, వాలి నిను తన తోకతో బందించి, సంధ్యావందనాన్ని పూర్తీ చేసుకొని, నిన్ను కిస్కిందలో వదిలివేసి ‘ఎవడురా ఈ పురుగు’ అని ఈసడించుకుంటాడు. అంతటి వాలిని ఒక్క బాణముతో కూల్చిన వీరుడు రాముడు.అది రాములవారంటే. రాములవారి వీరత్వమంటే.

‘కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె’- ఓ రావణాసురా, ఖరదూషణాది పద్నాలుగు వేలమందిని రాముడు ఒకే ఒక్క బాణముతో నేలకూల్చడయ్యా. శుర్పనఖ అందుకు ప్రత్యక్ష సాక్షి. అంతటి రాముడితో నీకు యుద్ధం తగునా? అటువంటి రాముడిని ఎదరు నిలబడి ఎవరి జయించగలరు. అంతటి వీరుడు రాముడు.

‘భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ’, అని భక్త రామదాసు తన కీర్తనలలో పేర్కొంటారు.

‘కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బా+ణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్యా కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకుసాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.’, అని ఈ కీర్తన యొక్క భావం.

ఇలాగ మనకి రాముడు వీరత్వము గురించి ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. రాముడు యుద్ధం చేస్తున్నాడు, రాముడు యుద్దానికి వెళ్తున్నాడు ఆంటే దేవతలు సైతం భయపడేవారు.

అయితే ఇప్పుడు మన కాలానికి, మన సమయానికి, మనం అన్వయించుకున్నప్పుడు, వీరుడంటే, వీరత్వం ఆంటే ఎవరిని పడితే వారిని కొట్టడం కాదు. వీరుడనేటటువంటి వాడు తన శక్తిని ముందు పదిమందికి ఉపయోగించటానికి వినియోగించి, అది గనుక ఆ విధముగా ఆ మార్గములో మంచి చెయ్యలేకపోతే అప్పుడు దండించటానికి వాడతారు తప్ప, వీరత్వము వుంది కదాని బలవంతులను, బలహీనులను బాధపెట్టకూడదు, వారిపైన తన వీరత్వాన్ని చూపకూడదు.

ఎవరు బలహీనులో ఆ బలహీనులకు తన బలాన్ని అండగా ఉంచేవాడు రాముడు. యుద్ధకాండలో మనకు కనిపిస్తుంది ఈ అంశం. రావణుడు రాముడి మీదకు బాణాలు వేసినప్పుడు రాముడికి కోపం రాలేదు, కోపం తెచ్చుకోలేదు ఆయన. అదే హనుమంతుడి మీద బాణాలు వేసినపుడు, తన భక్తుల మీద ఎవరైతే దాడి చేస్తారో, వారిని ఏమాత్రం సహించడు రాముడు. తన కంటే బలహీనులు ఎవరైతే ఉన్నారో, వారిని రక్షించేటటువంటివాడు రాముడు. అందుకే రామనామం నిన్ను కాపాడుతుంది అంటారు. రాముడు వీరత్వం అటువంటిది.

మనకి behaviour science లో మూడు మాటలు చెప్తారు – you have to be assertive, neither aggressive nor submissive. aggresive ఆంటే అవతలి వ్యక్తి మీద దాడి చెయ్యటం లాంటిది, గూండాగిరి అంటుంటాము కదా. అవతలివారు బలవంతులా, బలహీనులా అని తెలుసుకోకుండా వారి మీద దాడి చెయ్యటం (మాటల ద్వారా) అది aggresive behaviour. submissive ఆంటే బలహీనుల లక్షణం. అవతలి వారు ఏమి చెప్పినా, వారికీ దాసోహమనటం, వారికి వత్తాసు పలకటం, వారితో ఉండటం. దీన్ని submissive behaviour అంటాము. ఈ రెండు పనికిరావు, assertive behaviour ఉండాలి అంటారు.

‘నీ ఆలోచనలను, నీ దృక్పధాన్ని, నీ మనస్సులోని మాటను నువ్వు వ్యక్తపరచి ఆ విధముగా ముందుకు వెళ్లగలగాలి’, అవతల నీకంటే బలవంతుడు ఉన్నాడు ఆంటే. (బలవంతుడు శారీరికంగా బలవంతుడు కావచ్చు, మానసికముగా బలవంతుడు కావచ్చు, అస్త్ర శాస్త్రాలలో బలవంతుడు కావచ్చు (skill set, capabilities, features, charecterstics ఇత్యాదివాటిల్లో బలవంతుడు కావచ్చు)) కాబట్టి బలహీనులు అయినంత మాత్రాన submissive behaviour లోకి వెళ్లాలని లేదు, బలవంతులు అయినంత మాత్రాన మనము aggresive గా వెళ్లకుండా ఉండగలగాలి. కాబట్టి దీన్ని assertive behaviour అంటారు, అదే రాముని వీరత్వము. ‘వీర్యవాన్’, అనే పదానికి ఉన్న అర్థం మనకి దీనిలో కనిపిస్తుంది.

కాబట్టి మన behaviour ఎప్పుడూ కూడా aggressive, submissive గా ఉండకూడదు, assertive గా ఉండాలి అని రాముడి ద్వారా వాల్మీకి మహర్షి మనకు తెలుపుతున్నారు. కాబట్టి వీర్యవాన్.

రామాయణం- రాముడి లక్షణాలు మూడు నాల్గొవది ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ

రాముడంటేనే ధర్మాత్ముడు, ధర్మజ్ఞుడు. ధర్మానికి మారుపేరు రాముడు. పోత పోసిన ధర్మానికి ఒక రూపం ఉంటే అది రాములవారే అంటారు వాల్మీకి మహర్షి. ఎందుకంటారు ఆంటే, ఏ సమయములోనైనా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఆచరించినటువంటి మహనీయుడు రాముడు.

‘రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః | ఈదృశీ ఇయం మమ అలక్ష్మీః దహేత్ అపి పావకం’, – ‘ఓ లక్ష్మణా, మనము చక్రవర్తి కుమారులము, రాజ్యాన్ని పోగొట్టుకొని వనవాసానికి వచ్చాము, ఇక్కడ సీతమ్మని పోగొట్టుకున్నాము, ఇప్పడు సీత ఎక్కడ ఉందొ తెలీదు, మనకున్న ఏకైక రక్ష జటాయును కూడా కోల్పోయాము’, అని శ్రీరాములవారు లక్ష్మణునితో అరణ్యవాస సమయములో పేర్కొంటారు. ఎంత కష్టం రావాలో, అంత కష్టం వచ్చినా సరే ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు రాములవారు.

మనకిచ్చే సందేశం ఏమిటంటే, ధర్మము (అది పుత్ర ధర్మం కావచ్చు,స్నేహ ధర్మం కావచ్చు, సోదర ధర్మం కావచ్చు, ఉద్యోగ ధర్మం కావచ్చు, వ్యవహార ధర్మం కావచ్చు), ఏ సందర్బములో ఏ ధర్మాన్ని ఆచరించాలో అది వదిలిపెట్టకుండా ఉండటమే ఉన్నతమైన లక్షణము. అందుకనే రాములవారు కైకతో ఒక సందర్బములో చెప్తారు, ‘కేవలం ధర్మాన్ని ఆశ్రయిస్తాను, ధర్మాన్ని మాత్రమే పట్టుకొని ఉన్నాను’, అని.

అన్ని బాగుంటే ధర్మాన్ని పట్టుకొని ఉండటం చాలా తేలిక. నిజానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ధర్మానుచరణ చెయ్యగలిగినవాడే చాలా గొప్పవాడు. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ధర్మాన్ని పట్టుకొని ఉండేవాడే గొప్పవాడు. ఇక్కడ ధర్మం ఆంటే వైదిక ధర్మం కాదు, ధర్మం ఆంటే duty bindedness ,duty fullness. మనము ఏ సమయానికి ఏ duty లో ఉంటామో, ఆ duty ని ఏ మాత్రం మనం looseness లేకుండా నిబద్దతతో చెయ్యటమే రాముడి నుంచి మనము నేర్చుకోవాల్సినది, రామాయణము మనకు నేర్పేది. ఇదే మనము రాముడి లక్షణమైన ‘ధర్మజ్ఞశ్చ’ నుంచి నేర్చుకోవాల్సినది. ఆ విధముగా ఉండగలిగిన మానవుడు మహోన్నతుడు, మహాత్ముడు, గొప్పవాడు.

రాములవారికున్న 16 లక్షణాలలో తరువాతి లక్షణం – కృతజ్ఞశ్చ. కృతజ్ఞత ఆంటే being grateful. మనము ఎవరెవరికి సహాయం చేసామో చాలా మంది గుర్తుంచుకుంటారు, కానీ మనకి ఎవరు సహాయం చేసారో మర్చిపోతారు. కానీ నిజానికి శాస్త్రం ఏమి చెప్తోందంటే, మనము ఎవరికి సహాయం చేసామో వారిని మర్చిపోవాలి, మనకి ఎవరు సహాయం చేసారో వారిని యావజ్జివనపర్యంతం గుర్తుంచుకోవాలి. ఆ లక్షణం మనకి రామాయణం నేర్పిస్తుంది.

రాముడు యుద్ధం పూర్తీ అయిన తరువాత వానరులందరిని పిలిచి, “మీ వలెనే నేను యుద్ధంలో గెలిచాను, మీరే యుద్దములో జయించారు”, అని ఆ credit అంతా వానరులకు ఇచ్చేసాడు. నిజానికి సమాజములో ఇవాళ చూస్తే, ఇతరులతో పనిచేయించి (subordinates) ఆ presentation తీసుకెళ్లి boss కి చూపించే లోకమిది. అలాచేస్తే కృతఘ్నులు అనిపించుకుంటారు కానీ కృతజ్ఞత ఉండదు.

కృతజ్ఞత కలిగి ఉండాలి ఆంటే చిన్నది చేసినా, పెద్దది చేసినా, ఎవరు ఎటువంటి సందర్బములో చిన్నదైనా, పెద్దదైనా ఏ సహాయం చేసినా వెంటనే వారిని recognize చెయ్యగలగటం. మీరు ఎవరినైతే recognize చేస్తారో వారు మీ పట్ల కృతజ్ఞులై ఉంటారు. ప్రతిమనిషిలో కూడా కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. ఈ సహజమైన లక్షణాలను కొన్ని సందర్భాలలో స్వార్థమనే లక్షణముతో వాటిని తొక్కిపెట్టి అసహజముగా ప్రవర్తిస్తుంటాడు మానవుడు. సహజమైన లక్షణమైన కృతజ్ఞత అనే లక్షణాన్ని మనము పైకి రానిస్తే మహాత్ములమవుతాము, మహోన్నతనికి చేరుకుంటాము అని మనకి రామాయణము చెపుతోంది.

రాముడు ప్రతి చిన్న పని, ఎవరు ఏ చిన్న పని చేసినా కృతజ్ఞత చూపించాడు, అందుకే ఉడుతా భక్తి అనే సామెత వచ్చింది. అంత పెద్ద సేతువు నిర్మాణం జరుగుతూ ఉంటే అంత చిన్న ఉడుత అందులో నాలుగు రేణువుల ఇసుక వేస్తె అది ఎంత? కాబట్టి ఎంతదైనా సరే చిన్నదైనా, పెద్దదైనా సహాయం సహాయమే. చేసినవారి పట్ల దాని సహాయం పొందినవారు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలసినదే అని రామాయణం పేర్కొంటోది. సేతు నిర్మాణంలో సహాయ పడిన ఉడుతను తన చేతులలో తీసుకోని, మెల్లగా నిమిరి, దాని మీద శాశ్వత ముద్ర వేశారు రాములవారు. రాములవారి ఆ స్పర్శ వలన ఇప్పటికి కుడా మనము ఉడుతకి ప్రత్యేకమైన స్థానమును ఇస్తున్నాము. తన శక్తి మేర సహాయము అందించిన జాతిగా ఆ ఉడుత జాతిని మనము గుర్తిస్తున్నాము.

అలాగే మన ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మనము ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. వారందరి పట్ల, వారు చేసిన చిన్న చిన్న సహాయాలు, పెద్ద పెద్ద సహాయాలు, సహకారాలు ఏవైనా సరే, మనము తప్పక గుర్తుంచుకోవాలి. సహకారానికి కూడా recognization ఇవ్వాలి. సహాయము వేరు, సహకారము వేరు. సహకారం అందించకపోతే చెయ్యలేని పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి సహకారం చేసిన వారిని గుర్తుపెట్టుకొని వారి పట్ల మన కృతజ్ఞత ఆవిష్కరించాలి. రామాయణములో రాములవారు ఈ లక్షణాన్ని అనేకసార్లు ప్రదర్శించారు కావున ‘కృతజ్ఞశ్చ’

రామాయణం- రాముడి లక్షణాలు అయిదు ఆరవది- సత్యవాక్యో దృఢవ్రత:

‘సత్యవాక్యో’, సత్యమునే పలుకు. రాముడు ఎప్పుడు అసత్యమును మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడినా సత్యమునే మాట్లాడాడు. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం’ అంటుంది శాస్త్రం. ‘సత్యమునే పలుకు, అయితే సత్యము ఒకవేళ అప్రియమైనది అయితే పలుకవద్దు, ఆలా అని అవతలి వ్యక్తికి ప్రితికరముగా ఉంటుంది కాదని అప్రియము మాట్లాడవద్దు’, అని శాస్త్ర వాక్కు. రాముడు ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడాడు, శాస్త్రాన్ని ఆధారముగా చేసుకొనే మాట్లాడాడు.

‘సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా. సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్’, అని రాములవారు అయోధ్యకాండలో పేర్కొంటారు. ‘సత్యంతోనే భగవంతుడు పొందబడతాడు. సత్యం వలన అన్ని సంపదలు లభిస్తాయి. సత్యం అన్ని సుఖాలకు మూలం. సత్యం కంటే పొందవలసినది మరేమీ లేదు.’ అని ఈ శ్లోకార్థము. సత్యమే దైవ స్వరూపముగా భావించి నడుచుకోవాలి అని రాములవారు మనకి మార్గనిర్దేశం చేసారు. అయితే ఈ రోజుల్లో అసత్యాన్ని పలికేవారే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. సత్యమును పలకటం చాలా కష్టం అని మన భావన. నిజానికి సత్యం మాట్లాడటం కష్టం కాదు, మాట్లాడకుండా ఉండటం కష్టం. అది సాధన చెయ్యాలి. అది మనకి రామాయణం నేర్పుతుంది.

సత్యవాక్యో – రామచంద్రమూర్తి ఎప్పుడు మాట్లాడినా సత్యాన్నే మాట్లాడినా మహనీయుడు. మనము ఒక్క క్షణము ఉహించుకుందాము – ఒక మనిషి ఎప్పుడు మాట్లాడినా సత్యాన్నే మాట్లాడినవాడైతే, అసత్యాన్ని మాట్లాడవలసి వస్తే అతను మాట్లాడకుండా ఉంటే, అటువంటి మనిషిని అభిమానించని వారు ఎవరైనా ఉంటారా? ఆయన ప్రవర్తనని మనము హర్శిస్తామా, హర్శించమా? ఆయనను మనము ఆమోదిస్తామా, ఆమోదించమా? మనమెందుకు ఆలా ఉండకూడదు, మనమెందుకు ఆ ప్రయత్నం చెయ్యకూడదు. రామాయణం మనకు నేర్పుతుంది – సత్యవాక్యో

‘దృఢవ్రత:’, అంటే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వ్రతాన్ని తప్పక ఆచరించే లక్షణం. రాములవారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితులలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ఉదాహరణకు పితృవాక్య పరిపాలన అనే వ్రతాన్ని రాములవారు తీసుకున్నారు. తండ్రి చెప్పిన మాట ఆచరించటం. ఈనాటి సమాజములో తనయులందరు నేర్చుకోవలసిన అంశం రామాయణం నేర్పుతోంది.

శ్రీరాముడు తన “తండ్రి ఏది చెప్తే అది నాకు శాసనం” అనే వ్రతాన్ని తీసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో విశ్వామిత్రుడి వెంట రాములవారు వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని ఇక్కడ మనము చెప్పుకోవాలి. తాటకి సంహార సమయములో విశ్వామిత్రులవారు, “రామా, తాటకి స్త్రీ అని సంహరించాలా వద్దా అని ఆలోచిస్తున్నావా”, అని ప్రశ్నిస్తారు. అప్పుడు రాములవారు, “మా నాన్నగారు మీతో ఉండమన్నారు. మీరు ఏది చెపితే అది చెయ్యమన్నారు. ‘పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్’ (పిత్రు వచనమును గౌరవించుటకునూ, మా తండ్రి ఆజ్ఞాపించుటవలననూ, నాకు ఆ మాట ఉల్లంఘింపరానిది)”, అని విశ్వామిత్రులతో పేర్కొంటారు.

విశ్వామిత్రుడి

16 సంవత్సరాల సమయములో ఏ మాట మీద కట్టుబడి ఉన్నారో (పితృవాక్య పరిపాలన), అదే మాట మీద అరణ్యవాస సమయములో కూడా రాములవారు కట్టుబడి ఉంటారు. రాములవారు వనవాసానికి వెళ్లిన సమయములో భరతుడు రాములవారి దగ్గిరకు వెళ్లి, అయోధ్యకు రమ్మని ప్రార్తించినప్పుడు, ఇదే మాటను రాములవారు భరతునితో పేర్కొంటారు. ” భరతా, 14 సంవత్సరాలు వనవాసం చెయ్యమని నాన్నగారు ఇచ్చిన మాట. ఇప్పుడు నాన్నగారు లేరు. నాన్నగారు లేరు కదాని అయిన ఇచ్చిన మాటను నేను తప్పితే నా సత్యవ్రతమునకు భంగం, నాకే కాదు మనుష్య లోకానికంతటికి సత్య దీక్ష ఏమిటంటే సత్యమునే పాటించాలి. భగవంతుడు ఎక్కడో లేడు, మనము మాట్లాడే నిజమైన మాటల్లోనే సత్యమున్నది, ఆ సత్యములోనే పరమాత్మ శక్తి ఉన్నది కనుక నేను రాను”, అంటాడు స్వయముగా భరతుడు వచ్చి ప్రార్థించినా కూడా.

ఇప్పటి మన పరిభాషలో చెప్పాలంటే ‘దృఢవ్రత:’ అంటే determination, పట్టుదల. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై – యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ – ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై – ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్’ అని పేర్కొన్నట్లు పని మొదలుపెట్టమంటే ఏదైనా అది పూర్తి అయ్యేవరకు పట్టుదల ఉండాలి. పట్టుదల, మొండితనం, మూర్కత్వము అని మూడు శబ్దాలు ఉన్నాయి మనకి. ముర్కత్కము పనికిరాదు కానీ పట్టుదల ఉండాలి. మొండితనం కొన్ని కొన్ని సందర్భాలలో ఉండాలి.

ఇలా మనకి రామాయణం నేర్పించేటటువంటి లక్షణాలలో ‘దృఢవ్రత:’ అంటే determination, అని మనము అర్థం చేసుకుంటే మనము జీవితములో ఎన్నో సాధించవచ్చు, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించవచ్చు, మానవుడు మహనీయుడిగా మారవచ్చు అని ఈ యొక్క శ్లోకము విశ్లేషణ ద్వారా మనకు అర్థం అవుతున్నది.

రామాయణం- రాముడి లక్షణాలు ఏడు ఎనిమిది- చారిత్రేణ చకోయుక్త:

‘చారిత్రేణ చకోయుక్త:’, అంటే ఈ కాలములో చెప్పుకోవాలంటే charecter. మన charecter మనమే build చేసుకోవాలి. మన charecter మనము build చేసుకోవాలి అంటే కొన్ని values, కొన్ని principles, life లో positive aspects of life అన్ని మనము అర్థం చేసుకొని దాని ప్రకారముగా మన charecter build చేసుకోవాలి. అందుకోసమే ఒక మహానుభావుడు అన్నాడు, “if money is lost, wealth is lost, nothing is lost, if charecter is lost everything is lost” కాబట్టి charecter అనేటువంటిది అందరితో మనము ఎలా తిరుగుతున్నాము, అందరితో మనము ఎలా మెదులుతున్నాము, అందరితో ఎలా కదులుతున్నాము, అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాము, మనలో ఉన్న విలువలు ఎటువంటివి, ఉన్నతమైన మానవ జన్మ లభించినందుకు మనము ఎలాంటి విలువలు పెంపొందించుకుంటున్నాము అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.

మన ప్రవర్తన ద్వారా పది మందికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని విశ్లేషించుకుంటూ, మనసా వాచా కర్మణా, మనస్సులో అటువంటి ఆలోచనలే కల్పించుకుంటూ, వాక్కు ద్వారా పదిమందికి మేలు కలిగే మాటలే మాట్లాడుతూ, చేసే పనుల ద్వారా పది మందికి మేలు కలిగేలా చేస్తే, అదే ధర్మవ్యాప్తి. రామచంద్రమూర్తి అలాగే ప్రవర్తించాడు. అలాగే నడుచుకున్నాడు గనుక చారిత్రుడు అయ్యాడు, గనుక చారిత్రేణ చకోయుక్త:

ఆ తరువాతి మాట ‘సర్వభూతేషు కోవిదః.’ ‘ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతనః’, అని సనాతన ధర్మం పేర్కొంటోంది. సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి, భోదించినటువంటి, ఒకే ఒక్క ప్రధానమైనటువంటి అంశమేమిటంటే సమస్త భూతములను నీలాగా చూడటం అలవాటు చేసుకో. భగవాన్ రమణుల చరిత్ర చదివితే అటువంటి ఘటనలు మనకు చాలా కనపడతాయి. ఆశ్రమములో కుక్కలు ఉండేవి, గోవులు ఉండేవి, రకరకాల జంతువులు ఉండేవి, పక్షులు ఉండేవి, వాటన్నిటితో ఆయన సంభాషించే వారు, వాటిలో ఉన్న జీవాన్ని అయిన గుర్తించగలిగేవారు.

మనలో ప్రాణమునట్లుగానే అందులో కూడా ప్రాణముంటుంది, అది కూడా ఒక ఉపాధే, దానికి ప్రాణముంటుంది, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఇవ్వనీ వాటికీ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక కుక్క మీదకి రాయి వేస్తె అది కుయ్యో అని మొత్తుకుంటుంది. కాబట్టి ఆలా చెయ్యకుండా సమస్త భూతములను తనలాగా చూడమని మనకి సనాతన ధర్మం చెప్తోంది. అలాగే రామచంద్రమూర్తి ‘సర్వభూతేషు కోవిదః’ అని మనకి ఆచరణలో చూపారు.

నిజానికి రామచంద్రమూర్తి మానవ జాతికి చెందినవారు. కానీ ఆయన ఎవరితో స్నేహం చేసారు అని ఒక్కసారి గమనిస్తే, వానర జాతితో, భల్లూక జాతితో, రాక్షస జాతితో. అది రాములవారి ప్రత్యేకత. మన సనాతన సంప్రదాయములో శంకుస్థాపన చేసినప్పటి నుంచి గృహాప్రేవేశం లోపల ఏ ఇల్లు కట్టడానికి మనకు చోటు ఉన్నదో, అక్కడ నివసించే క్రిమి కీటకాదులు, సర్పజాతులు, వీటన్నిటికీ ఇల్లు లేకుండా చేస్తాము కనుక గృహాప్రేవేశం అయిన తరువాత శాంతిహోమం, బలిప్రదానం చెయ్యండి అని చెప్పిన కారణం అది. ఈ విధముగా సర్వభూతేషు కోవిదః అని రామచంద్రుడు తాను ఆచరించి చూపించాడు కనుక, మనము రామచంద్రుని ఆచరించగలిగితే, అనుసరించగలిగితే, ఆలా ప్రవర్తించగలిగితే రామరాజ్య స్థాపన తప్పక సాధ్యమే.

రామాయణం- రాముడి లక్షణాలు తొమ్మిది పది – ఆత్మవాన్ కో జితక్రోధః

ఆత్మవాన్ అంటే తన గురించి తాను తెలుసుకున్నవాడు ఎవ్వరు అని మహర్షి వాల్మీకి నారదులవారిని ప్రశ్నిస్తారు. తన గురించి తాను తెలుసుకోవటం ఏమిటి? సహజముగా మనము “నువ్వు ఎవరు – who are you”, అని ఇతరులను ప్రశ్నిస్తాము. అందుకు వారు చెప్పే జవాబులు “నా పేరు ఫలానా, నేను ఫలానా వారి అబ్బాయిని, నేను ఫలానా సంస్థలో ఉద్యోగిని, నేను ఫలానా కళాకారుడిని”, అని. అయితే ఇవేమి వారు కాదు, అవన్నీ వారి గుర్తింపులు. ఇదే ప్రశ్నను భగవాన్ రమణులు తనని చూడటానికి వచ్చిన వారందరిని అడిగేవారు. “నిన్ను నువ్వు తెలుసుకో, అది ఒక్కటి తెలుసుకుంటే సమస్తము బోధపడుతుంది”, అంటారు.

“ఆత్మజ్ఞానము” తెలుసుకున్నవాడే గొప్పవాడు అంటారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు శ్రీరామచంద్రుడు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు, “నేను వేరు, నాది వేరు”, “నేను వేరు, ఈ శరీరం వేరు”, అనేటువంటి జ్ఞానాన్ని పొందినవారు. ఆ జ్ఞానము శాస్త్రాధ్యయనముల ద్వారా వస్తుంది. రాముడికి శాస్త్ర జ్ఞానముతో పాటు శాస్త్ర జ్ఞానము కూడా ఉండేది. శాస్త్ర జ్ఞానము తెలిసినవాడు కనుక ‘ఆత్మవాన్ కో’.

‘చదివి చదివి చదివి చావంగ నేటికి? చావులేని చదువు చదవవలయు
చదువులేక కోటి జనులు చచ్చిరికదా! విశ్వదాభిరామ వినురవేమ!’, అన్ని వేమన కవి పేర్కొంటారు. ఎటువంటి చదువు చదవాలంటే, ‘ఏ చదువు చదివితే మళ్ళీ జన్మ రాకుండా ఉంటుందో, ఆత్మ కనుక సాక్షాత్కారం అయి భగవంతుడితో ఐక్యమౌతుందో అటువంటి చదువు చదవాలి’ (ఆత్మజ్ఞానాన్ని తెలిపే చదువు) అన్నారు.

‘చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ’, అని పోతనగారు భాగవతములో పేర్కొన్నారు. చదువులలో మర్మాన్ని చదువుకోండి, అప్పుడు ఆత్మజ్ఞానం కలిగితుంది అని భాగవతం పేర్కొంటోంది.

what is there beyond the boundaries of physics అని గనుక మనము అర్థం చేసుకోగలిగితే, physical world కి అవతల spiritual world, there is a divine energy behind the physical energy. ఈ చర్మచక్షువులు చూడగలిగినది కేవలముగా ఈ physical world మాత్రమే. మన మనో నేత్రముతో మాత్రమే spiritual world దర్శించగలము అని శాస్త్రము పేర్కొంటోంది. ఈ జ్ఞానము ఉన్నవాడు రామచంద్రుడు కనుక ఆత్మవాన్. అటువంటి జ్ఞానము కనుక మనము తెలుసుకోగలిగితే ఆ స్థాయికి చేరుకోగలరు అని రామాయణం పేర్కొంటోంది.

‘జితక్రోధః’, అంటే కోపాన్ని జయించినవాడు రాముడు. కోపాన్ని జయించాడు అన్నారు కానీ కోపం లేనివాడు అనలేదు మనము గ్రహిస్తే కనక. కోపం ప్రతి వారికీ వస్తుంది, కోపం రావటం సహజం. ‘తన కోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!”, అని సుమతి శతకకారుడు పేర్కొన్నాడు. కాబట్టి కోపాన్ని జయించుకోవాలి. కోపాన్ని ఎలా జయించాలో ఆలా సాధన చేసి కోపాన్ని జయించగలగాలి.

“ఉత్తమే క్షణిక:కోప: | మధ్యమే ఘటికాద్వయమ్ | అధమే స్యాత్ అహోరాత్రం | పాపిష్టే మరణాన్తక”, అని శాస్త్రం పేర్కొంటోంది. ఉత్తమునియందు కోపం క్షణకాలం ఉంటుంది. మధ్యమునియందు రెండు ఘడియలు (48 నిమిషములు) ఉంటుంది. అధమునియందు ఒక రోజు ఉంటుంది. కాని, పాపిష్టునియందు చచ్చేంత వరకూ ఉంటుంది. కోపం రావటంలో తప్పులేదు, కోపం ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఆ కోపాన్ని క్షణములో జయించగలగాలి. ఇందుకు ఒక ఉదాహరణ రామాయణములో మనకు కనిపిస్తుంది.

రాములవారు మూడు రోజులపాటు దీక్షగా సముద్రుడిని ప్రార్థిస్తారు దారి ఇవ్వమని. సముద్రుడు కనిపించడు. కరుణించని సముద్రుడి మీద కోపం వస్తుంది. “లక్ష్మణా బాణం తీసుకురా, సముద్రుడిని ఇంకింప చేస్తాను”, అంటాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, “రామా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. మీ సైన్యములో నీలుడు అనేవాడికి ఉన్న శక్తిని వినియోగించి సముద్రం మీద వారధి కట్టి సముద్రాన్ని దాటి వెళ్ళండి”, అని పేర్కొంటాడు. సముద్రుడి మాటలు విన్న రామచంద్రమూర్తి తన కోపాన్ని తగ్గించుకుంటాడు. కాబట్టి కోపాన్నిజయించగలగాలి.

కోపాన్ని జయించటమంటే కోపం రాకుండా ఉండటం కాదు, వచ్చిన కోపాన్ని సంబాళించుకోగలగాలి. ఆలా చేయగల సమర్థులు రాములవారు కనుక ‘జితక్రోధః’. రాముడు ఎవరి మీద కోపం రావాలో, వారి మీద తెచ్చుకునేవాడు. ఉదాహరణకు ఖర దూషణాదులు పద్నాలుగు వేల మందితో యుద్దానికి వచ్చినప్పుడు రాముడు వారిమీద కోపాన్ని తెచ్చుకున్నాడు. అలాగే రావణుడు యుద్దములో హనుమంతులవారి మీద, వానర సైన్యం మీద బాణాలు వేసినప్పుడు రాముడికి కోపం వస్తుంది. రావణుడు తన మీద బాణాలు వేసినా రాముడికి కోపం రాలేదు. కానీ ఎప్పుడైతే రావణుడు తన శిష్య బృందం మీద, తన అనుయానుల మీద, వానర సైన్యం మీద ప్రయోగించినప్పుడు రాముడు కోపం తెచ్చుకుంటాడు.

కోపం ఎక్కడ తెచ్చుకోవాలో అక్కడ తెచ్చుకోగలగాలి, ఎక్కడ నిగ్రహించాలో అక్కడ నిగ్రహించగలగాలి. అనుగ్రహానికి, నిగ్రహానికి సమర్థుడైనవాడు కోపాన్ని జయించినట్టు. కాబట్టి ‘జితక్రోధః’ అన్న లక్షణము ఆలా అన్వయించుకోగలగాలి. అప్పుడు రాముడి లక్షణం మనము కూడా అన్వయించుకున్నట్లే. ఆలా చేస్తే ప్రస్తుత సమాజములో మహర్షి వాల్మీకి పేర్కొన్న 16 గుణములలో ఒక గుణాన్ని మనము అన్వయించుకున్నవారమౌతాము.

రామాయణం-రాముడి లక్షణాలు 11,12 విద్వాంకః సమర్ధశ్చ

రాములవారి కున్న మరొక విశిష్ట లక్షణం ‘విద్వాంకః’. రామచంద్రమూర్తి విద్వంసుడు అంటే విద్వత్ కలిగినవాడు అంటే విద్య కలిగినటువంటి వాడు అంటే విజ్ఞానము కలిగినవాడు అంటే విషయ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈ లక్షణాలు మనలో ఉంటే మనము కూడా రాముడి లాంటి వారమే. రాముడు కేవలం శస్త్ర జ్ఞానమే కాకుండా శాస్త్ర జ్ఞానము కూడా కలిగినవాడు అని మనకు రామాయణములోని అనేక ఉదంతాల ద్వారా మనకు తెలుస్తోంది.

కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము. వనవాస సమయములో ధర్మశాస్త్రం గురించి కైకతో, సీతమ్మతో, కౌసల్యతో చర్చ జరుగుతుంది. అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి ఆయా ఘట్టాలని ఎంతో రమ్యముగా వర్ణిస్తారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బాగా చదివినట్లుగా మనకి కనపడుతుంది. అలాగే అరణ్యవాస సమయములో రాముడు వాస్తు శాస్త్రాన్ని ఉటంకిస్తూ లక్ష్మణులవారితో, “లక్ష్మణా, ఈ ప్రదేశం మన నివాసానికి చాలా అనువుగా ఉంది. ఇక్కడ మనము పర్ణశాల నిర్మిద్దాము”, అంటారు. కాబట్టి వాస్తు శాస్త్రం కూడా తెలిసినట్లుగా మనకనిపిస్తుంది.

అలాగే అరణ్యకాండలో మరొక సందర్బములో దశరధుడు మరణించాడు అనే వార్త తెలియగానే తర్పణాదులు ఇత్యాదివి చేస్తాడు. కాబట్టి వేద శాస్త్రం కూడా బాగా చదివినట్లుగా మనకనిపిస్తుంది. మహర్షి వసిష్ఠుల వారు, జాబాలి ఇత్యాదులందరు వచ్చి వెనక్కి రావాలి అని చెప్పినప్పుడు శాస్త్రం మీద చర్చ జరుగుతుంది. ఆ సమయములో జాబాలి మహర్షి చెప్పినటువంటి విషయము తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. తర్క శాస్త్రం మీద రామచంద్రుడు మహర్షి జాబాలి సమాధానం ఇస్తాడు. కాబట్టి వేరు వేరు సందర్భాల్లో శాస్త్రానికి సంబందించిన జ్ఞానం పొందినవాడు కనుక ‘విద్వాంకః’ అన్నారు.

మనము జీవితములో మన యొక్క subject నేర్చుకొని ఆగిపోతే, beyond that అని మనకు శాస్త్రం పేర్కొంటోంది, సనాతన ధర్మం నేర్పిస్తున్నది. అది ఏమిటి అని మనకు తెలుసుకోగలగాలి. నిరంతరం జ్ఞానసముపార్జన చేస్తూ గడపాలి తప్ప ఏదో అయిపోయింది degree వచ్చేసింది, లేదా PHD అయిపోయింది అని అక్కడే ఆగిపోకూడదు. ఒక subject లో అయిపోయి ఉండవచ్చు కానీ ఇంకా చాలా ఉన్నది ప్రపంచములో నేర్చుకోవాల్సిన అంశాలు. కాబట్టి వాటిని కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి.

‘అధ్యయన, అధ్యాపన’ – నిరంతరం మనిషి తాను తెలుసుకుంటూ ఉండాలి, తనకు తెలిసింది పది మందికి చెపుతూ ఉండాలి. ఇది ఉత్తముల లక్షణం అని మనకి రాముడి చరిత్ర ద్వారా, రాముడి నడక ద్వారా, రాముడి నడవడిక ద్వారా తెలుస్తుంది. ప్రస్తుత సమాజములో అన్వయించుకోవాలంటే మనకి thought leaders అని ఉంటారు. వారికి ఇది చాలా గొప్ప సూచన, గొప్ప లక్షణం. ప్రతి organization లో కూడా మనకి thought leaders అని ఉంటారు. వారు భవిష్యత్ ను కూడా ఉహించుకొని, గతములో జరిగిన దానిని తలచుకొని organization కు కావాల్సిన route map ఇస్తూ ఉంటారు, దానిని modify చేస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి విజ్ఞానం ద్వారా thought leadership కి ఒక role model గా రామాయణములో మనకి కనపడతారు. కాబట్టి ‘విద్వాంకః’ అంటే జ్ఞాన సముపార్జన ఎప్పుడు చేస్తూనే ఉండాలి అని మనకి రామాయణం చెప్తున్నది.

తరువాతి లక్షణం సమర్ధశ్చ. అంటే capability , effectiveness , efficiency , managerial capabilities . ఈ లక్షణాలు రాములవారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనకి రామాయణం పేర్కొంటోంది. రాములవారు సమర్థుడు అని చెప్పేందుకు రామాయణములో మనకి ఎన్నో ఉదంతాలు మనకి కనిపిస్తాయి.

రాములవారి చిన్నతనములో తండ్రి మాటను అనుసరించి విశ్వామిత్రులవారి వెంట యాగానికి వెళ్ళినపుడు తాటక వధ చేస్తారు. తాటకి అనే రాక్షసిని మహర్షి వాల్మీకి భయంకరముగా వర్ణిస్తారు. ఆ రాక్షసిని చూస్తే ఎంతటి వారైనా బయపడాల్సినదే. కానీ రాములవారు మాత్రం ఏ మాత్రం భయం అన్నది లేకుండా, తండ్రి ఆదేశానుసారం గురువు ఆజ్ఞను పాటిస్తూ, అన్యమైన ఆలోచనలను మనస్సులోకి రానీయకుండా, తన సమర్థతతో తాటాకిని వదిస్తారు. అలాగే అహల్య శాపవిమోచనం చేసారు, శివ ధనుర్బంగం చేసారు. ఆ సమయములో పరశురామునితో సంవాదం చేస్తారు. ఏ సమయములో చూసినా రాములవారి సమర్థత మనకి కనిపిస్తుంది.

దశరధ మహారాజు రాములవారిని పిలిచి, “రామ రేపే నీకు పట్టాభిషేకం”, అంటే సరే అంటారు. మరుసటి రోజున దశరధ మహారాజు మళ్ళీ రాములవారిని పిలిచి, “రామ నువ్వు వనవాసం చెయ్యాలి”, అంటే సరే అంటారు. తండ్రిని ఎలా గౌరవించాలో రాములవారు మనకు తెలుపుతారు. తాను ఎంతటి సమర్థుడనైనా తండ్రికి మాటకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. దశరధుడి ముందు ఎక్కువగా మాట్లాడినట్లుగా కూడా మనకి రామాయణములో ఎక్కడా కనిపించదు. రాములవారు సీతమ్మకు, కౌసల్యకు, కైకకు, హనుమకు, సుగ్రీవుడికి, విభీషణుడుకి ధర్మాధర్మాల గురించి, శాస్త్రాల గురించి చెప్తారు, కానీ తండ్రితో మాత్రం ఎప్పుడు చర్చించలేదు. అంటే గురువులతో, పెద్దలతో, తండ్రితో ఎలా గౌరవంగా ఉండాలి అని రాముడి ద్వారా మనము తెలుసుకోవాలి.

సమర్ధత అనేది మన ప్రవర్తన ద్వారా మనకు వస్తుంది, విషయ జ్ఞానము ద్వారా వస్తుంది. capability అంటే knowledge అనేది మొదట acquire చేసి ఆ తరువాత implementation of knowledge చేసి మన capability మనము నిరూపించుకోవాలి. మనిషి మహనీయుడిగా ఎదగటానికి ఒక మార్గం ఇది, ఇది రామాయణం మనకి తెలుపుతోంది.

రామాయణము -రాముడి లక్షణాలు ద్యుతిమాన్,అనసూయకః

ద్యుతిమాన్ అంటే దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయేవాడు అని అర్థం. అంటే ప్రకాశము, జ్యోతి. రాముడిని చూస్తే ఒకరకమైనటువంటి జ్యోతి ఆయనలో నుంచి వస్తూ ఉండేది. ద్యుతి అనే శబ్దానికి determination అని కూడా ఒక అర్థం చెప్తారు. ఈ శబ్దానికి ఇక్కడ అర్థము, దివ్యమైన ప్రకాశముతో మనిషి ఎలా ఎదుగుతాడు అంటే మనస్సు కనుక స్వచ్ఛముగా, నిర్మలముగా ఉంచుకోగలిగితే, మనస్సులో ఏ విధమైన కపటము, కల్మషము, కపటత్వము, క్రూరత్వము లేకుండా, ప్రసన్నముగా ఉండగలిగితే. “Face is the index of the mind” అంటారు కదా.

మనస్సు ఎలా ఉందొ ముఖము ఆలా చూపిస్తూ ఉంటుంది. రామచంద్రమూర్తి ముఖము ఎప్పుడు నిర్మలముగా ఉండేది, ప్రశాంతముగా ఉండేది, చిరునవ్వుతో ఉండేవాడు. కాబట్టి రామచంద్రులవారిని చూస్తే ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక ప్రకాశాన్ని చూసినట్లుగా ఉండేది. చల్లని చూపులు గలవాడు కనుక రామచంద్రమూర్తి అన్నారు. ఆ చంద్రుని స్వభావమైన వెన్నెలను, చంద్రుని లక్షణమైన వెన్నెలను తన చూపుల ద్వారా కురిపించే లక్షణం గలవాడు కనుక ‘రామచంద్రుడు’ అన్నారు.

అనసూయకః అంటే అసూయ లేనివాడు అని అర్థం. ఇది చాలా గొప్ప లక్షణం. రాముడు చక్రవర్తి కుమారుడు. ఆయన గుహుడిని కోరతాడు, “నీ సహాయం వలెనే గంగను దాటగలను, కాబట్టి గంగను దాటించే ప్రయత్నం చెయ్యి గుహా”, అంటాడు. అప్పుడు గుహుడు చెప్తాడు, “రామా, ఈ సర్వ ప్రపంచాన్ని కూడా సంసార సాగరాన్ని దాటించగల సమర్దుడువు. నన్ను గంగ దాటించామని అడగటం నాకు ఆశ్చర్యముగా ఉన్నది”, అంటాడు.

అప్పుడు రాములవారు గుహుడితో, “నీ శక్తి, నీ సమర్థత. ఒకరి సమర్థత మరొకరికి ఉండదు. అందరికి ఒకే రకమైన సమర్థత భగవంతుడు ఇవ్వడు. కొందరికి వాక్ వైభవము ఇస్తే, కొందరికి విద్య వైభవము ఇస్తే, కొందరికి లక్ష్మి వైభవమును అందిస్తాడు. వారి వారి యొక్క వైభవములను బట్టి వారి జీవితాలను వారు గడుపుతూ పది మందికి మేలు చేసేటటువంటి లక్షణము ఉంటుంది కనుక అందరికి అటువంటి అవకాశము ఇస్తాడు గుహా. కాబట్టి నీకున్నటువంటి శక్తి నాకు లేనటువంటిది, నావ దాటించి నన్ను అవతలికి ఒడ్డుకి చేర్చటం”, అని పేర్కొన్నారు.

ఏ మాత్రం అసూయ లేకుండా ఉండగలగడం రాములవారి లక్షణం. మాములుగా సహజముగా ఉండేటటువంటి ఆలోచన ఏమిటంటే “మనము చెయ్యలేకపోతున్నామే”, అనే అసూయకు లోనవడం. తనకు లేక అదో ఏడుపు, పరులకు ఉంటే మరో ఏడుపు అన్నారు. అసూయా, ద్వేషములు అన్నారు వీటిని. ఇవి లేకుండా ఉంటటువంటి వాడు మహాత్ముడు, మహనీయుడు, గొప్ప లక్షణము కలిగినటువంటి వాడు. “Greed” అనే ఒక్క లక్షణము ఉంటుంది. ఈ “Greed” అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే లక్షణాన్ని ఎవరైతే పెంచుకుంటారో, వారు తృప్తి లేకుండా, సంతోషం లేకుండా తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అది అసంతృప్తికి దారి తీస్తుంది. ఉదాహరణకి ఒకడికి స్కూటర్ ఉంటే, పక్కవాడికి కారు ఉంటే, “అరే నాకు కూడా కారు ఉండాలి”, అనే భావన ఉండటం. కారు వచ్చిన తరువాత పెద్ద కారు ఉన్నవాడిని చూసి ఆ భావన ఉండటం, పెద్ద కారు వచ్చిన తరువాత బంగాళా ఉన్నవాడిని చూసి ఆ భావన కలగటం. ఇవ్వని కూడా అసూయ లక్షణాలు.

ఈ అసూయ పోగొట్టుకోవడానికి తృప్తి అనే లక్షణాన్ని అలవర్చుకోవాలి. “తృప్తిని చెందని మూర్క మానవుడు సప్తద్వీపములను అధిరోహించినన్”, అన్నాడొక కవి. కాబట్టి ఎన్ని ప్రాంతాలు, ఎన్నో చోట్ల, ఎన్ని చేసినా ఏమి లేదో అదే చూసుకుంటారు కొందరు. కొంతమంది లక్షణాలు ఆలా ఉంటాయి. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనుకుంటూ ఉంటారు. తనకు భగవంతుడు ఏమి ఇచ్చాడో అది గుర్తుంచుకోరు. ఒకచోట చెప్తారు మనకి, “ఇల్లు లేదని బాధ పడేవాళ్ళు కొందరైతే, ఇల్లు ఉండి టాక్స్ కట్టాలని బాధపడేవారు మరికొందరు. నీకు ఇల్లు ఉందని సంతోషించు. అన్నం వండుకోవాలని బాధపడే వారు కొందరు. ఇల్లు, ఇంట్లో బియ్యం, పప్పులు ఉన్నందుకు సంతోషించు. అవి లేనటువంటి వారెందరో అన్నమో రామచంద్ర అని అలమటించే వారు చాలా మంది ఉన్నారు”. కాబట్టి నీకు ఏది ఉన్నదో అది చూసుకొని దాని ద్వారా మనము సంతోషిస్తే అసూయ అనే లక్షణాన్ని పక్కన పెట్టవచ్చు.

రాముడితో ఏ మాత్రము అసూయ ఉండేది కాదు. తన సేవకులందరిని కూడా ఆయన ప్రసన్నవదనముతో పలకరించేవారు. చక్రవర్తి ఆయన, ఆయనకు ఏమి తక్కువ కాదు. కానీ తన కృతజ్ఞతను ఆవిష్కరించే భాగములో, అవతలి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించే భాగములో వారిపట్ల ఏ మాత్రం అసూయ లేకుండా ఉండేవారు. ఇందుకు ఒక ఉదాహరణ మనకి సుందరకాండలో కనిపిస్తుంది. హనుమంతులవారు రాములవారి సీతమ్మ జాడ తెలిపినపుడు రాములవారు హనుమంతులవారు సాధించిన విజయానికి ఏ మాత్రం అసూయపడకుండా హనుమను ఆలింగనం చేసుకొని, “హనుమా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారముగా తిరిగి నేను ఇంతకంటే ఏమి ఇవ్వలేను. నా సర్వస్వాన్ని నీకు సమర్పిస్తున్నాను”, అంటారు. అనసూయకః యొక్క లక్షణము అలాంటిది.

రామాయణము -రాముడి లక్షణాలు కస్య బిభ్యతి దేవాశ్చ

‘కస్య బిభ్యతి దేవాశ్చ’, అంటే ‘ఏ మనిషిని చూసి దేవతలు సైతం బయపడతారో”, అని అర్థం. రాములవారి పరాక్రమానికి, రాముడి వీర్యానికి, రాముడి శౌర్యానికి, రాముడి వీరత్వానికి దేవతలు సైతం భయపడేవారు. రాములవారు యుద్ధం చేస్తుంటే దేవతలు సైతం భయపడేవారు.

“భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ”, అని దాశరథీ శతకంలో రాములవారి పరాక్రమాన్ని కీర్తిస్తాము. రాములవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పడు బాణం తీసాడో, ఎప్పుడు బాణం సంధించాడో, ఎప్పుడు బాణం వదిలిపెట్టాడో, ఎప్పుడు రెండవ బాణం తీసాడో కూడా కనపడేది కాదు. 14 వేల మంది ఖర దూషణాది రాక్షసులను ఒకేసారి సంహరించారు రాములవారు. అంతటి పరాక్రమవంతులు కనుకనే రామరావణ యుద్దములో రాముడు యుద్ధం చేస్తున్నపుడు దేవతలందరు వచ్చి చూసారు, పుష్ప వర్షం కురిపించారు.

అయితే ఇక్కడ ఒక సందేహం మనకు రావచ్చు. రాములవారు యుద్ధం చేసారు కావున దేవతలు భయపడటం సహజం. మరి మనల్ని చూసి దేవతలు ఎందుకు భయపడాలి? మనము ఏ యుద్ధం చెయ్యట్లేదు కదా? అయితే మనము కూడా ప్రతి నిత్యం యుద్ధం చేస్తున్న వాళ్ళమే. దేనితో యుద్ధం చేస్తున్నాము? అధర్మముతో యుద్ధం చేస్తున్నాము. కలికాలంలో నిత్యం ధర్మాధర్మాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది.

ప్రతి మనిషి యొక్క మెదడులో, మనస్సులో, ఆలోచనలో, హృదయములో యుద్ధం ఆవిష్కరిస్తూనే ఉన్నాము. కాబట్టి యుద్దములో మనల్ని చూసి దేవతలు కూడా భయపడాలి అంటే ధర్మనిష్ఠ, ధర్మకృత్యము, ధర్మానుష్ఠాము కలిగి ఉండాలి, ధర్మకార్యము ఆచరించాలి. ధర్మము ఎవరైతే ఆచారిస్తున్నారో వారిని చూసి దేవతలు కూడా భయపడతారు అని చెప్పేందుకు పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా ఋషులు తపస్సు చేస్తే వారి తపస్సును ఇంద్రుడు భగ్నం చేసేవాడు అని పురాణ కధల ద్వారా మనకు తెలుస్తోంది. ఎందుకంటే వారు తమ తపస్సు ద్వారా తన పదవిని అందుకుంటారేమో అనే భయం కారణముగా.

‘భీతోవా వాతః పవతామ్’, అని ఉపనిషత్ పేర్కొంటోంది. గాలి ఎవరికి బయపడి వీస్తోంది అంటే ఆ పరమేశ్వరుని శాసనానికి బయపడి. సూర్యుడు పరమేశ్వరుడి శాసనానికి బయపడి ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. పరమేశ్వరుడు ధర్మం అనే ఒక చట్రం, ఒక శాసనం, ఒక framework ఏర్పరిచాడు. ఆ ధర్మాన్ని అనుసరించి సూర్యుడు ఉదయించకపోయినా, అస్తమించకపోయినా పరమేశ్వరుడు సహించడు. అలాగే గాలి వీచటం వాయుదేవుని ధర్మం. ఆలా అని పెనుగాలులు విచకూడదు. కావున గాలి ఎంత వేగంగా విచాలి, ఏ కాలములో ఎలా విచాలి అనే పరమేశ్వరుని శాసనాన్ని అనుసరించి అలాగే వీయటం వాయుదేవుని ధర్మం. పరమేశ్వరుని శాసనాన్ని, తన ధర్మాన్ని వాయువు అతిక్రమించలేడు. కాబట్టి ఎవరు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరు ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటారో, ఎవరు ధర్మానువర్తకులై ఉంటారో, ఎవరు ధర్మాచరణ చేస్తూ వారిని చూసి దేవతలు కూడా భయపడతారు.

‘ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే’, ఆలా ఈ యుగములో ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తే నూటికో కోటికో ఒక్కరు కనపడతారు. ‘మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే’, అన్నారు కృష్ణులవారు గీతలో. సహస్రం అంటే వెయ్యి అని కాదు కొన్ని వేల కొలది మందిలో ఒకరు మాత్రమే ప్రయత్నిస్తారు అని అర్థం. ధర్మాచరణలో మన అనురక్తి, మన ధర్మానుష్ఠానం ఎలా ఉండాలి అంటే మనమాచరిస్తున్న ధర్మాన్ని చూసి దేవతలు కూడా భయపడాలి.

వేదం మనకి ఇలా వివరిస్తుంది, “వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని దేవతలంతా ఆశ్రయించుకొని ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వేదాధ్యయనం తెలిసినవారు ఏ సమయములో ఏ వేదం నుంచి ఏమి చదువుతారో తెలియదు కనుక, పిలిచినపుడు రాకపోతే ప్రమాదం కనుక వారు బ్రాహ్మణుని ఆశ్రయించుకొని ఉంటారు.” అలాగే ధర్మానుష్ఠానం చేసేవారిని కూడా దేవతలు ఆశ్రయించుకొని ఉంటారు. మన శరీరములోని అన్ని అంగాలలో దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం పేర్కొంటోంది. (ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు |) ఏ ఏ దేవతలు ఏ ఏ స్థానాలలో ఉండాలలో ఆయా స్థానంలో ఉంటూ ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటే, ఆ ధర్మానుష్ఠానం చేసేవారికి దేవతలు అధీనులై ఉంటారు అని శాస్త్రం పేర్కొంటోంది.

కాబట్టి ఎవరిని చూసి దేవతలు బయపడతారో అటువంటి మానవుడిగా మనల్ని మనము మార్చుకోవాలి అని వాల్మీకి మహర్షి రామాయణం పేర్కొంటోంది. ‘రామో విగ్రహావాన్ ధర్మః’, ‘సాధు సత్య పరాక్రమః’ అన్నా, రాముడు మహాత్ముడు, మహనీయుడు, గొప్పవాడు అన్నా దానికి కారణం రాముడు ధర్మాన్ని మాత్రమే పట్టుకొని ఉన్నాడు కనుక, సత్యము ధర్మము అనే రెండు కళ్ళు రాముడికి ఆయుధాలుగా చేసారు. ఆలా మనము కూడా చేస్తే రాముడంతటి వారు కాకున్నా, రాముడిలాగా వాళ్ళుగా మనన్ని మనము మార్చుకునే అవకాశం ఉంటుంది.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy