Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

రుద్రాభిషేకం విశిష్టత

రుద్రాభిషేకం విశిష్టత

“రుద్రాభిషేకం విశిష్టత” మీద పూజ్య గురుదేవులు అమెరికాలో అందించిన ప్రవచనామృతం

రుద్రాభిషేకం – వేదం

రుద్రాభిషేకం మనకి వేదవాఙ్మయముగా అందించబడిన తరించేటువంటి మార్గం. మన వాఙ్మయమంతా కూడా శృతి, స్మృతి, పురాణాల రూపములో మనకి అందిచబడినది. శ్రుతులు అంటే వేదములు, అవి శాసనముల రూపములో మన జీవన మార్గములో (వైదిక మార్గం) దశానిర్దేశం గావిస్తాయి. ఆత్మ యొక్క దర్శనం చేసుకొని ఆనందముగా జీవనం గడపాలి అంటే   ఎలా ఉండాలో, మనిషి తన జీవనం ఎలా గడుపుకోవాలో, పుట్టినప్పటి నుంచి షోడశ సంస్కారాలు చేసుకుంటూ తన ఆత్మను, తన శరీరాన్ని ఎలా సంస్కరించుకోవాలో ఇత్యాదులన్నీ చెప్పేటువంటిది వేదం.

ఈ వేదము ఎవరో మనిషి నుంచి వచ్చినది కాదు. సాక్షాత్తు పరమేశ్వరుని ఉచ్చ్వాస నిశ్వాసాలే వేదం. ‘దైవాధీనం జగత్ సర్వం’, ఈ జగత్తు అంతా ఆ పరమాత్మ అధీనములో ఉన్నదని చెప్తాము. అటువంటి పరమాత్మ ఆదేశానుసారముగా వచ్చిందే వేదం.

పరమేశ్వరుని ధ్యానం చేయటానికి మార్గమే ‘రుద్రాభిషేకం’

‘గాలి కూడా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి వీస్తున్నది”, అంటుంది వేదం. గాలి గట్టిగా వీచింది అంటే మనము తుఫాను అంటాము, మనుషులు తట్టుకోలేరు. మనుష్యులే కాదు, ఈ చరాచర జగత్తులోని 84 లక్షల జీవరాశులకు ఎంత మాత్రం కావాలో గాలిని విచింపజేస్తూ, మనకి కనపడకుండా, పరమాత్మ మనకు సహాయపడుతూ ఈ సృష్టిని నడుపుతున్నాడు.

సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఆయనకి భయపడే. భూమి నుంచి 149.75 మిలియన్ కిలోమీటర్ల  దూరములో ఉంటూ, అదే దూరాన్ని పాటిస్తూ, అక్కడి నుంచే తన వెలుగులను ప్రసరింపజేస్తున్నాడు. సూర్యుడు తన ప్రదేశం నుంచి ఒక్క మీటర్ దూరం పెరిగినా పది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది అని శాస్త్రజ్ఞులు పేర్కొంటారు. సూర్యుడు తన ప్రదేశం నుంచి ఒక్క మీటర్ తగ్గినా కూడా ప్రమాదమే. సూర్యుడిని తన కక్ష నుంచి పక్కకు జరగనీయకుండా, అక్కడే ఉంచుతూ మానవాళిని రక్షిస్తున్నది ఆ పరమాత్మే. అలాగే నవగ్రహాలు, నక్షత్ర మండపము ఇతడివివన్నీ ఏ కక్షలో ఉండాలో అక్కడే ఉంచుతూ మనల్ని సంరక్షిస్తున్నారు ఆ పరమాత్మ. ఈ సృష్టిలో ఉన్న అనేక కోటి బ్రహ్మాండాలలో భూమి ఒకటి అని వేదం పేర్కొంటోంది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక మొదలగు  ఊర్ధ్వసప్తలోకములను, అతల – వితల – సుతల – పాతాళ – రసాతల – తలాతల – మహాతల మొదలగు  అధోసప్తలోకములను కలిపితే ఒక బ్రహ్మాండం. (14)

ఇటువంటివి అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలన్నిటిని నిర్వహిస్తున్న వాడు పరమేశ్వర స్వరూపమైన ఈశ్వరుడు, పరబ్రహ్మ. బ్రహ్మ అంతే మనకి చతుర్ముఖ బ్రహ్మ గుర్తొస్తారు. కానీ ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటోంది వేదం. సదాశివ పరబ్రహ్మ, రామచంద్ర పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరబ్రహ్మ అంటుంటాము మనము. పరబ్రహ్మ శబ్దమునకు  నిరంజన, నిరాకార, నిర్గుణ స్వరూపము, అంటే ఒక ఆకారము లేనటువంటి పరబ్రహ్మ స్వరూపమును మనము రుద్రాభిషేకంతో అర్చన చేస్తున్నాము. ఆకారము లేనటువంటి వాడు కనుకనే లింగస్వరూపములో ఉన్నాడు. ఆది, అంతం లేనటువంటి స్వరూపం లింగ స్వరూపం.

మాములుగా ఒక రూపము ఉంది అంటే మనము ఆ రూపం యొక్క పాదాలు, శిరస్సు, ఆకారం ఇత్యాదివి దర్శించగలుగుతాము. కానీ లింగానికి ఇది ప్రారంభము, ఇది అంతము అని లేదు. అటువంటి పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, ఎవర్రా స్వరూపము అంటే, “లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్” అంటారు పోతన భాగవతములో. అక్షర పరబ్రహ్మ స్వరూపము, అంటే నాశనము లేనటువంటి స్వరూపము. మిగితా జీవులన్నిటికి కూడా ఆరు రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. (షడ్వికారములు – పుట్టటం, పెరగటం, మార్పు చెందటం, క్షీణిస్తున్నారు, నశిస్తున్నారు, లయమైపోతున్నారు.) ఇవి మనుష్యుల విషయములో,  84 లక్షల జీవరాశులలో జరిగే సహజ పరిణామము. ఇవి లేనటువంటి వాడు, ఆ అక్షర పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుని ధ్యానం చేయటానికి మనకు ఆ వేదం ఇచ్చినదే   ‘రుద్రాభిషేకం’

భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటం ఎలా?

‘దైవాధీనం జగత్ సర్వమ్’, అంటే ఈ జగత్తు అంతా ఆ దైవానికి అధీనమై ఉంటుంది అని శాస్త్రం పేర్కొంటోంది. భగవంతుడి ఆదేశం మేరకే ఏదైనా జరుగుతుంది అని పెద్దలు పేర్కొంటారు. ఈ సత్యం మనందరికి ఎన్నో సార్లు అనుభవం అయ్యే ఉంటుంది. ఉదాహరణకు కొన్ని సందర్భాలలో మనము ఏమి ప్రయత్నించకుండానే ఫలితం మనకు లభిస్తుంది, కొన్ని సందర్భాలలో ఎన్ని సార్లు ప్రయత్నించినా ఏ ఫలితం దక్కదు. మనము సాధించాము, మనము చేసుకున్నాము అని భావిస్తూ ఉంటాము. కాని అది తప్పుడు ఆలోచన, అహంకార భావన.

‘ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః । అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే’, ‘అహంకార విమూఢాత్మా’ (అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు) తామే కర్తలము అనుకుంటారు అని గీతలో కృష్ణులవారు పేర్కొన్నారు. అది సరికాదని, మానవులు ఎలా కర్మలను చెయ్యాలో వివరిస్తూ, ”మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా । నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః”, ‘అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ, స్వార్ఠ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై, యుద్ధం చేయుము!’ అని కృష్ణుడు గీతలో పేర్కొంటారు.

మరి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటం ఎలా? ఈ జగమంతా ఆ పరబ్రహ్మ అధీనములో ఉన్నది కావున, ఆ పరబ్రహ్మ యొక్క అనుమతి లేకుంటే మనము ఏమి చెయ్యలేము కనుక, మనము స్వతహాగా అశక్తులము కావున, మనము ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటం తప్పనిసరి. భగవంతుడు అనుమతిస్తే తప్ప మన జీవితములో ఏమి సాధ్యం కాదు, మనమేమి చేయలేము. అశక్తులమై ఉన్నాము, కావున అయిన అనుమతి తప్పనిసరి. ఈ జగత్తు అంతా శాసించేవాడు పరమేశ్వరుడు కనుక, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనకు ఉంటే తప్ప మనము తలపెట్టిన కార్యాలలో విజయం సాధించలేము. ఈ సత్యాన్ని గ్రహించిన మన మహర్షులు, ఋషులు (Modern day scientists) ఆ దైవం యొక్క అనుగ్రహం పొందటానికి మనకు ఒక మార్గాన్ని అందించారు.

‘మంత్రాధీనంతు దైవతం’, పరమేశ్వరుడు మంత్రానికి అధీనుడై ఉంటాడు, మంత్రాల ద్వారా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని మహర్షులు పేర్కొన్నారు. ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటానికి మన మహర్షులు చూపిన మార్గమే – మంత్రానుష్ఠానం. పూజలో భాగంగా మనము ‘మహాగణపతిమ్ ఆవాహయామి’, అంటే ఆ పరబ్రహ్మ పూజా ప్రదేశానికి వచ్చి కూర్చోవాల్సినదే. అందుకే దేవతలందరు కూడా వేదం చదువుకున్న బ్రాహ్మణుని ఆశ్రయించుకుని ఉంటారు అని శాస్త్రం పేర్కొంటోంది.

మంత్రానుష్ఠానం విశిష్టత ఏమిటి?

ఈ కాలము శాస్త్రజ్ఞులు దైవం కోసం బయట పరిశోధన జరిపితే, ఆ కాలం శాస్త్రజ్ఞులైన మహర్షులు దైవం కోసం తమ అంతరంగములో పరిశోధన చేసి, దైవాన్ని సాక్షాత్కరింపచేసుకొని, తాము గ్రహించిన సత్యాలను మనకందించారు. దైవం మంత్రానికి అధీనుడై ఉంటాడు అని మహర్షులు గ్రహించి ఆ సత్యాన్ని మనకందించారు. ఒకేసారి అనేక చోట్ల మంత్రానుష్ఠానం చేస్తే దైవం అన్ని చోట్లా ఉండగలడా అని ఒక సందేహం మనకు కలగచ్చు.

దేవతలకు మనలాగా ఒక్కదగ్గిర ఉంటే ఇంకో దగ్గిర ఉండలేని స్థితి ఉండదు. వారు ఒకేసారి అనేక రూపాలు ధరించగలరు, ఒకే రూపములో అనేక చోట్ల ఒకేసారి నివసించగలరు. ఉదాహరణకు కృష్ణపరమాత్మ ఒకేసారి 16 వేల మంది గోపికల దగ్గిర ఉండగల శక్తి గలవాడు అని భాగవతం పేర్కొంటోంది. భగవంతుడు అంటే omnipotent, omnipresent, omniscient .సర్వవ్యాపకత్వం కలిగినవాడు. దేవతలకు ఆ శక్తి ఉంటుంది కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలరు. ఎంత మంది మంత్రంతో పిలిస్తే అంతమంది దగరికి వచ్చి తీరాలి, వస్తారు. అందుకనే ఇన్ని దేవాలయాలు. ఎక్కడ దేవాలయములో ఆవాహన జరిగితే, ఎక్కడ పూజ జరిగితే అక్కడ ఆ పరమేశ్వరుడు తప్పక ఉంటాడు.

పరమేశ్వరుడిని అతి తేలికగా ప్రసన్నం చేసుకునే విధానము?

పరమేశ్వరుడు మంత్రానికి అధీనుడు, అయితే పరమేశ్వరుడిని అతి తేలికగా ప్రసన్నం చేసుకునే విధానము, మంత్రం ఏమిటి? స్వయముగా ఆ పరమాత్మే తాను రుద్రం ద్వారా ప్రసన్నుడనౌతాను అని యజుర్వేదంలో పేర్కొన్నాడు. ఒకానొక సందర్బములో దేవతలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడినే ఇలా ప్రశ్నిస్తారు, “మహాదేవా, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవటానికి అతి తేలికైన మార్గం ఏది?”. అప్పుడు పరమేశ్వరుడు వారికి ఇలా బదులిస్తాడు,” వేదములో చెప్పబడిన రుద్రం ద్వారా నిన్ను అతితెలికగా ప్రసన్నడనౌతాను”. ఆ పరమేశ్వరుడిని అతి తేలికగా అందుకోవటానికి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చెప్పిన మార్గమే రుద్రం. ఇది ఎక్కడ చెప్పబడింది అని ఒక ప్రశ్న? ఉపనిషత్తులలో రుద్రాభిషేకం యొక్క విశిష్టత పేర్కొనబడ్డది. వేదాలు అనంతమైనవి కావున, సంపూర్ణ వేదాధ్యయనం అసాధ్యం కావున, వేదాలలో చెప్పిన ముఖ్యమైన అంశాలను ఉపనిషత్తుల రూపములో, స్మృతుల రూపములో, పురాణాల రూపములో పెద్దలు, మహర్షులు మనకందించారు. ఈ శాస్త్రాలలో రుద్రం యొక్క విశేషత పేర్కొనబడ్డది.

అయితే ఇక్కడ ఒక సందేహం. పరమేశ్వరుడికి రుద్రం అంటే ప్రీతి, మరి ఇతర దేవీదేవతలకు? ఏ దేవతారాధనకి సంబందించిన మంత్రానుష్ఠానం ఆ దేవతారాధనకు ఉంటుంది అని శాస్త్రం పేర్కొంటోంది. ౩౩ కోట్ల మంది దేవతలు ఉన్నారు అని వేదం పేర్కొంటోంది. ఇక్కడ మరొక సందేహం మనకు కలగచ్చు. దైవం ఒక్కడు కాదా, ఏ దేవతను పూజించాలి? సాదారణముగా సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయుడికి ఇలా వారానికి ఒక దేవుడి చప్పున మనము పూజిస్తూ ఉంటాము. అయితే ‘ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్‌ వాక్యం, ఉన్నది ఒకటే సత్యం. ఈశ్వరుడు ఒక్కడే, రెండవది లేదు – ‘ఏకమేవా ఽ ద్వితీయం బ్రహ్మ – నేహ నానాస్తి కించన ’ అని శ్రుతి వాక్కు. అనగా బ్రహ్మ ఏకము. నానాత్వము లేదు అని అర్థము.

అనేక పూజలు, మంత్రాలు, తంత్ర విధానాలు ఎందుకు?

భగవంతుడు ఒక్కడే అయినప్పటికి, అనేక పూజలు, మంత్రాలు, తంత్ర విధానాలు ఎందుకు వచ్చినయ్యి అని మరొక ప్రశ్న? సైన్స్ తో అనుసంధానం చేసుకుంటూ ఈ సందేహానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భగవంతుడు అంటే ఆదిపరాశక్తి అంటున్నాము. ఆదిపరాశక్తి అమ్మవారు. ‘అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ’, అని పోతనగారు భాగవతంలో ఆ తల్లిని కీర్తిస్తారు. ఆదిపరాశక్తి మూలం, మూలశక్తి. ‘సచామర రామావాణి సవ్యదక్షిణ సేవితా’, అని లలిత సహస్ర నామాలలో ఆ తల్లిని కీర్తిస్తాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే పైన ఉన్న స్వరూపము. అది అంటే ప్రారంభము, శక్తి అంటే ENERGY. ఇప్పుడు ఈ ENERGY నే మహర్షులు దేవతా శక్తి అన్నారు.

‘Energy can neither be created or destroyed’ అని సైన్స్ పేర్కొంటోంది. భగవత్ శక్తిని మనము తయారు సృష్టించలేము, నశింపచేయలేము, కేవలం ఉన్నశక్తిని ఉపయోగించుకోగలము. Energy అనేక రకాలుగా సైన్స్ పేర్కొంటోంది – Thermal energy, wind energy, hydel energy. వీటినే అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణ దేవుడు అంటున్నాము. Energy that is prevailing in the cosmos that energy is being decimated in different portions and different forms. Now we will use that energy however that needs to be used. అలాగే ఇప్పుడు ఏ energy ని నేను tap చెయ్యాలో ఆ అక్షరాలను మహర్షులు మంత్రముగా మనకందించారు. ‘ఓం నమః శివాయ’ అనావయ్యా, ఆలా ఆంటే సర్వవ్యాపకమైన భగవత్ శక్తి ఒక రూపములో నీ దగ్గిరకు వస్తుంది. అలాగే ‘ఓం గం గణపతయే’ అనావయ్యా, ఆలా ఆంటే అదే శక్తి విఘ్ననివారణ శక్తి రూపములో నీ దగ్గిరకు వస్తుంది. అన్నారు. ఆలా అనేక మంత్రానుష్ఠాన విధానాలు మహర్షులు దర్శించి మనకందించారు.

రుద్రం విశిష్టత ఏమిటి?

రుద్రం విశిష్టత గురించి మన శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి. ‘యః శతరుద్రియమధీతే సోఽగ్నిపూతో భవతి స వాయుపూతో భవతి స ఆత్మపూతో భవతి స సురాపానాత్పూతో భవతి స బ్రహ్మహత్యాయాః పూతో భవతి స సువర్ణస్తేయాత్పూతో భవతి స కృత్యాకృత్యాత్పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితో భవత్యత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్‘, అని కైవల్యోపనిషత్ పేర్కొంటోంది. ‘ఎవరైతే రుద్ర పారాయణ చేస్తారో, వారు నిప్పులో కడిగినట్లుగా పవిత్రులు అవుతారు. వారు అనేక మహాపాపాలు చేసి కూడా తాను చేసింది తప్పు అని గ్రహించి రుద్ర పారాయణ చేస్తే, వారు పవిత్రులు అవుతారు. వాయు పురాణం రుద్రాభిషేక విశిష్టత గురించి వివరిస్తూ, “ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో, వారు తమ శరీరం పడిపోయాక తాము శరీరంతో ఉన్నపుడు తన స్వంత ఇంటికి ఎలా వెళతారో , అలాగ వారు ఏ అడ్డంకులు లేకుండా శివసాన్నిధ్యానికి  చేరుకుంటారు.”, అని పేర్కొంటోంది.

మంత్రానుష్ఠాన నియమాలు ఏమిటి?

అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే వేదము శివస్వరూపము. మనము వేదము పఠిస్తున్నాము అంటే కొన్ని నియమాలను తప్పక అనుసరించాలి. వేదపఠనానికి కొన్ని నిర్ధిష్టమైన లక్షణాలను పెద్దలు చెప్పారు. అందులో మొదటిది వర్ణం. వర్ణమాలలో మనకి 56 అక్షరాలు కనిపిస్తుంటాయి. మంత్రం కాని అక్షరం లేదు. అయితే ఏ దేవుడికి సంభందించిన మంత్రం ఆ దేవుడికి ఉంటుంది. రెండవ లక్షణం స్వరం – ఉదాత్త, అనుదాత్త,  స్వరిత, దీర్ఘస్వరిత అనే లక్షణాలు ఉంటాయి. ఏ అక్షరము కిందకి పలకాలో, ఏ అక్షరం పైకి పలకాలో, ఏ అక్షరం ఎక్కువసేపు పలకాలో అలా పలికితేనే ఆది వేదోచ్ఛారణ అవుతుంది. ఈ నియమం మంత్రాలకు మాత్రమే, స్తోత్రాలకు కాదు. మూడవ లక్షణం – మాత్ర – ఎంత మాత్రం పలకాలో అంత మాత్రమే పలకాలి, నాలుగవది – బలం – ఎంత బలముతో చెప్పాలో మంత్రము అంత బలముతో చెప్పాలి , ఐదవది – సమం, ఆరవది – సంతానం. ఏ స్వరములో పలకాలో, ఎంత బలముగా పలకాలో, ఎంత సేపు పలకాలో, ఎంత స్వరముతో పలకాలో అలా పలికినపుడే అది వేదోచ్చారణ అవుతుంది,లేకపోతే అది అక్షర సముదాయం మాత్రమే అవుతుంది. కావున గురువు దగ్గిర నేర్చుకొని రుద్రాభిషేకం చేయటం ఉత్తమం.

మనలో ఉన్న పంచ బ్రహ్మమైన ఈశ్వర తత్వం ఏమిటి?

ఈశ్వర తత్త్వం అంటే “సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన” అనే పంచ ముఖములు కలిగిన రూపం. ఈ ఐదు ముఖములు పృద్వి, ఆకాశ, వాయు, నీరు, ఆకాశము అనే పంచభూతాలకు ప్రతీక. మనము ఏ వైపుకు చూసిన ఈ పంచభూతములు కనపడినట్లే, ఆ ఈశ్వరుడు అంతటా కొలువై ఉన్నాడు. అయితే పంచభూతాలు అంటే మన కంటికి కనిపించేవి మాత్రమే అంటే అది సరి కాదు. మనలో కూడా పృద్వి, ఆకాశ, వాయు, నీరు, ఆకాశము అనే పంచభూతాలు ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ ఈ పంచ బ్రహ్మమైన ఈశ్వర తత్వం ఉంటుంది. అందరిలోనూ ఈ తత్వం ఉండాల్సినదే.

మన శరీరంలోనే మట్టి ఉన్నది, నీరు ఉన్నది. గాలి పీల్చకపోతే మనము బతకలేము, శరీరానికి ఒక కనీస ఉష్ణోగ్రత అవసరం, శరీర భాగాలు చెడిపోనీయకుండా వాటి పని అవి నిరతంతరం చేస్తూ ఉండాలి. ఇలా పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనకి దాహం వేసినపుడు నీరు తాగుతున్నాము. ఆ దాహం మనకు ఎలా దాహం వేస్తోంది? ఈశ్వరుడు మనలో ఉండి మనకు దాహాన్ని కలిగించి నీరు త్రాగమని నిరంతరం గుర్తు చేస్తుంటాడు. ఆయన గుర్తు చెయ్యటం మానేస్తే అది రోగం.  ‘అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్య స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః‘ అని ఆ శివుడిని కీర్తిస్తాము. ఘోరమైన రూపముతో, అనారోగ్యాన్ని కలిగించి శరీరాన్ని పడగొట్టేది ఆ ఈశ్వరుడే, శరీరాన్ని నిలబెట్టేది ఆ ఈశ్వరుడే. అఘోర, ఘోర రెండు ఆ ఈశ్వరుడి రూపాలే.

శ్రీ రుద్రంలో భాగంగా లఘున్యాసం ఆచరించేటప్పుడు దేవతలను మన శరీరములోని వివిధ అంగాలమీద ఆవహించుకుంటూ మంత్రం ఉచ్ఛరిస్తాము.

ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు | జఠరేఽఅగ్నిస్తిష్ఠతు | హృద’యే శివస్తిష్ఠతు | కంఠే వసవస్తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు | నాసికయోర్-వాయుస్తిష్ఠతు | నయనయో-చంద్రాదిత్యౌ తిష్టేతాం

ఏ ఏ దేవతా శక్తులు శరీరములో ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పే మంత్రం ఇది.

శరీరము సకల దేవతా స్తానం. ఇష్టఫల ప్రాప్తి (తాను అనుకున్నది జరగాలని), అనిష్ట నివృత్తి (తనకు వద్దన్నది రావద్దని) అనే కోరికలు నెరవేరాలంటే శరీరములోని దేవతలు వారి వారి స్థానాలలో ఉండేలా మనము నడుచుకోవాలి అని రుద్రం మనకు వివరిస్తోంది.  మనందరిలోను ఆ పరమశివుడు ఉంటాడు అని శాస్త్రం పేర్కొంటుంది.

రుద్రం యొక్క మహత్యం ఏమిటి?

 ‘విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్‘, అని శ్రీ రుద్రం నమకంలో ఒక మంత్రం. రుద్రం యొక్క మహత్యం ఏమిటి అంటే అది రుద్రం చేసేవారికే కాకుండా సకల లోకానికి మేలు కలిగిస్తుంది. రుద్రంలోని మంత్రాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయి. ఆ మంత్రోచ్చారణతో లోకానికి అంతటికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అందుతాయి, తద్వారా లోకక్షేమం జరుగుతుంది. ఈ రుద్ర పరాయణతో  విశ్వం – అంటే చరాచరాత్మకమైన జగత్తు,  ‘ఈ గ్రామంలో’ (గ్రామే అస్మిన్) అనే భావానికి మన అనుభవంలో – మన చుట్టూ ఉండే ప్రాంతంలో గోచరించే జగత్తు – అని అర్థం. ఊరిలో అన్నీ పుష్టిగా ఉండాలి. అందులో సాటి మానవులే కాదు, జీవకోటి అంతా – పశువులు, పొలమూ, నీరు, గాలీ అన్నీ పుష్టిగా ఉండాలి అని రుద్రం పేర్కొంటోంది. అందుకే గ్రామ గ్రామాన రుద్రం పఠించండి అని  పెద్దలు, మహర్షులు పేర్కొంటారు.

గ్రామం అంటే పురం అని కూడా అర్థం వస్తుంది.  ‘నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ నకారయన్” అని గీతలో చెప్పినట్లుగా తొమ్మిది ద్వారాలు గల ఈ దేహమనే పురంలో మనము నివసిస్తున్నాము. ఎవరైతే కైవల్యం కోరుకుంటున్నారో, అంటే మోక్షాన్ని ఆశిస్తున్నారో వారికి పుష్టిని కల్పించి శివసాయుజ్యాన్ని అందిస్తుంది రుద్రపఠనం. ఎవరైతే మోక్షాన్ని కాదని భోగాల్ని కోరుకుంటారో వారికి భోగాల్ని అందిస్తుంది రుద్రపఠనం. ఆరోగ్యం కోరుకుంటే ఆరోగ్యం, ఎవరు ఏది కోరితే వారికి వాటిని అందిస్తుంది రుద్రపఠనం. ధన, కనక, వస్తు, వాహన, కాంచన, ధేను, పుత్ర, పౌత్ర  అనే అష్టసిద్దులు మనకు రుద్రపఠనం ద్వారా లభిస్తాయి. ‘అష్టసిద్ధి నవనిధికె దాత‘, అని మనము హనుమను కీర్తిస్తాము. హనుమ వేరు శివుడు వేరు కాదు. ఈశ్వరుడే హనుమ.

ఈశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి, మనిషికి కూడా మూడు కళ్ళు ఉంటాయి. ఈశ్వరుడు తన మూడవ కన్ను తెరిస్తే లయం అయిపోతుంది. అలాగే మనిషి కూడా. ఏమిటా మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రం. మనిషి ఈ జ్ఞాననేత్రాన్ని ఎప్పుడూ మూసి ఉంచుతాడు. ఆ నేత్రాన్ని తెరిపించేది రుద్రాధ్యాయము. ఎవరి ఇంటిలో అయితే నిత్యం రుద్ర పఠనం జరుగుతూ ఉంటుందో, వారికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? ‘చదివి చదివి చదివి చావంగ నేటికి? చావులేని చదువు చదవవలయు చదువులేక కోటి జనులు చచ్చిరికదా! విశ్వదాభిరామ వినురవేమ!’ అన్నారు యోగి వేమన. 

పనికి రాని చదువులు ఎన్ని చదివినా ఏమి ప్రయోజనం. అసలు చావంటూ లేని చదువు చదివితే సత్యమంటే ఏమిటో తెలుస్తుంది అని భావం. ఆ జ్ఞానాన్ని మనకందించేది రుద్రపారాయణ. భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించి, ఆ రూపాన్ని మనము ఆరాధిస్తున్నాము. అలాగే పరమేశ్వరుడికి ఒక రూపాన్ని కల్పించాము. అయితే ఆ రూపమే పరమేశ్వరుడు అని భావించకూడదు. ఈశ్వర తత్వాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ తత్వాన్ని మనకందించేది రుద్రపారాయణ.

నమ్మకానికి, విశ్వాసానికి మధ్య తేడా?

శాస్త్రమును, గురువును నమ్మి, విశ్వాసముతో, శ్రద్ధతో, శాస్త్ర నియమాలను పాటిస్తూ రుద్రపారాయణ చేస్తే అది మనకు తప్పక సత్ఫలితాలను అందిస్తుంది. నమ్మకానికి, విశ్వాసానికి మధ్య తేడా తెలిపే ఒక చిన్న కథ. ఈ కథను రామకృష్ణపరమమహంస తన శిష్యులకు బోధించేవారు. పూర్వకాలములో రోప్ వాక్ అని ఒక విద్యని ప్రదర్శించే వారు ఉండేవారు. రెండు ఎత్తయిన ప్రదేశాల మధ్య ఒక తాడు కట్టి, ఏ ఆధారము లేకుండా, ఆ తాడు మీదగా అటు, ఇటు నడవటాన్ని రోప్ వాక్ అనేవారు. ఆలా ఒకరు వచ్చి వారి విద్యను ప్రదర్శిస్తూ ఉంటే ఎంత మంది చూసి ఆనందించసాగారు. “నేను నడవటం కాదు, నా పిల్లవాడిని కూడా నడిపిస్తాను”, అని ఆ గారడీవాడు తన పిల్లవాడిని భుజం మీదగా పెట్టుకొని ఆ తాడు మీదగా నడిచాడు. అది చూసి అక్కడివారందరు ఆనందించారు. “నా మీద నమ్మకం కలిగిందా?”, అని అతను వారిని ప్రశ్నించాడు. “అవును, నువ్వు మా ముందే నడిచావు కదా, మాకు నమ్మకం ఉంది” అన్నారు వారు. “సరే మీ పిల్లవాడిని ఇస్తారా, వారిని కూడా నడిపిస్తాను”, అన్నాడు ఆ గారడీవాడు. ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు, అతనికి బదులివ్వలేదు. విశ్వాసం లేకపోవటమంటే అది. వారికి ఆ గారడీవాడి మీద నమ్మకం వుంది కానీ విశ్వాసం లేదు.

 నమ్మకానికి, విశ్వాసానికి తేడా అది. మనమందరము కూడా వారిలాంటి వారమే. భగవంతుడిని నమ్ముతాము, కానీ విశ్వసించము. అందుకే మనకు పూజల ద్వారా ఫలితాలు లభించవు. “శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుధ్యాసవధారణా ! సాశ్రద్దా కథితా సద్భి: !! ” అని శాస్త్రవాక్యం. శాస్త్రాలలో గురువాక్యంలో అచంచలమైన నమ్మకమే శ్రద్ధ. ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి. శ్రద్ధ లేని కర్మ కోరిన ఫలాన్నివ్వదు . అందువలన మనము చేసిన ఏ కర్మ అయినా కోరిన ఫలములివ్వలేదంటే ఆ కర్మను మనము శ్రద్ధతో చేయలేదని అర్ధం. అలాగే రుద్రపారాయణ కూడా. రుద్రము అంటే శ్లోకాలు  కాదు మంత్రాలు అని గుర్తుంచుకొని తగిన శ్రద్ధతో పారాయణ చెయ్యాలి. అప్పుడే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి.

నమకము అంటే?

రుద్రంలో మనకి నమకము, చమకము ఉంటాయి. నమకము అంటే నమః శబ్దముతో వస్తుంది. పరమశివుని యొక్క తత్వాన్ని విశ్లేషణ చేస్తూ, ఈశ్వరుని సర్వత్రా గుర్తిస్తుంది. ‘నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుంజిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’’, అని ఆ ఈశ్వర స్వరూపాలను మనకు రుద్రములో కీర్తిస్తాము. రథకారేభ్య’శ్చ అంటే carpenter,  పుంజిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ అంటే వేటగాడు, మత్స్యకారుడు అని అర్థం. ఇలాగ ప్రతి రూపములో ఆ ఈశ్వరుడే ఉన్నాడు అని రుద్రములో మనము ఆ పరమేశ్వరుడిని కీర్తిస్తున్నాము.

‘నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ – అందరికన్నా పెద్దవాడు, చిన్నవాడు (పెద్దవాళ్లలో, చినవాళ్లలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు), నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ – అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు. (ముందున్నవాళ్ళల్లో, వెనకున్నవాళ్లలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు) పూర్వజాయ అంటే మన ముందున్నవాడు అని మాత్రమే అర్థం కాదు, మనకన్నా జ్ఞానములొ, తెలివితో, విద్యలో ముందున్నవాళ్లలో, మన గురువులలో, మన పూర్వికులలో, మనజీవితాలలో మన మార్గములో మనకన్నా ముందున్నవారిలో అని అర్థం. గురువులో ఈశ్వరుడు ఉన్నాడు కానీ శిష్యుడిలో ఈశ్వరుడు లేడు అని అంటే అది దోషం, దైవనింద చేసినట్లు. కావున ఈశ్వరుడు  సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అని భావిస్తూ ‘నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ ఓ ఈశ్వరా నీకు మా నమస్సులు అంటున్నాము.

రుద్రం యొక్క సంపూర్ణ అర్థం మనము తెలుసుకోవాలంటే అది అనంతము. రుద్రాన్ని ఎలా పారాయణ చెయ్యాలో గురుముఖతః తెలుసుకోవటం ముఖ్యం. ఒక్కదారి గురుముఖతః తెలుసుకొని రుద్రపారాయణ చేస్తే, అర్థం పూర్తిగా తెలియకపోయినా ఆ పారాయణ ఫలితాలు మనకు తప్పక లభిస్తాయి. ఎలా అయితే ఒక మాత్ర యొక్క తయారీ విధానం తెలియకపోయినా వైధ్యుడి మీద నమ్మకం ఉంచి ఆ మాత్ర వేసుకుంటే తత్ఫలితము లభిస్తుందో, అలాగే రుద్రం యొక్క సంపూర్ణ అర్థం తెలియకపోయినా, తగిన శ్రద్దా భక్తులతో రుద్రపారాయణ చేస్తే  తత్ఫలితము తప్పక లభిస్తుంది.

ఈశ్వరుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అని నమకములో ఆ పరమాత్మను కీర్తిస్తున్నాము. నమకము అంతా కూడా ఆ ఈశ్వరుడిని స్తోత్రం, ప్రార్థన చేస్తున్నాము. ‘ఇందు గలడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు’, అనే స్వరూపాన్ని రుద్రం మనకు ఆవిష్కరిస్తుంది. ‘నమః’ అంటే ‘నేను అంటూ వేరేగా ఏమి లేను’, అని అర్థం, అంటే సర్వస్యశరణాగతి. ఈ సర్వస్యశరణాగతి భావనతో ఎవరైతే రుద్ర పారాయణ ప్రారంభం చేస్తారో వారికి ఎన్నో విశేష ఫలితాలు లభిస్తాయి. కేవలం భక్తి ఉండి విశ్వాసం లేకుండా రుద్ర పారాయణ ప్రారంభం చేస్తే, అది తగిన ఫలితం ఇవ్వదు.

రుద్రాభిషేకం ఏ భావనతో ఆచరించాలి?

‘ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోఽభిషించేచ్ఛివం’ అని రుద్రం పేర్కొంటోంది. రుద్రుడిని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే రుద్రుడికి అభిషేకం చేస్తారో వారి కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి. ధ్రువపదం, అంటే తప్పనిసరిగా, guarentee.  మనము అభిషేకం చేసినా కోరికలు తీరలేదు అంటే వేదము తప్పు అని భావించకూడదు. అభిషేకం అంటే పరమేశ్వరుని మీద నీళ్లు పొయ్యటం మాత్రమే అని భావించి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితము లభించదు. అభిషేకానికి, నీళ్లు పోయటానికి తేడా తెలుసుకొని అప్పుడు ఈశ్వరుడికి అభిషేకించాలి అని శాస్త్రం పేర్కొంటోంది. శివలింగం అంటే అది కేవలం ఒక రాయి మాత్రమే కాదు, ‘బ్రహ్మాండ వ్యాప్త దేహభసితహిమరుచో – భాసమానా భుజంగై: కంఠేకాలాః కపర్థాకలిత శశికలా- చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్ష భూషా :ప్రణత భయహరాః – శాంభవా మూర్తిభేదా: రుద్రా: శ్రీ రుద్రా ప్రకటిత విభవా – నః ప్రయచ్ఛంతు సౌఖ్యం’, అని వేదం పేర్కొంటోంది. ఆ భావనతో రుద్రాభిషేకం చెయ్యాలి.

‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌! మనస్యన్యత్‌ వచస్యన్యత్‌ కర్మణ్యన్యత్‌ దురాత్మనామ్‌!!’ అని శాస్త్రం పేర్కొంటోంది. మనస్సు, మాట, చేత ఒక్కటిగా ఉండాలి . మనసులో సంకల్పించినది మాట రూపంలో ప్రకటిస్తూ, దానిని కార్య రూపంలో చేసి చూపే అటువంటి వారు మహాత్ములు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు  దురాత్ములు.  ఈ విధంగా మనసా, వాచా, కర్మణా ఏకత్వంతో అభిషేకం ఆచరించాలి అని శాస్త్రం పేర్కొంటోంది. వేదంలో కూడా delivary system ఉన్నది. అన్నం వండటానికి బియ్యం, పాత్ర, నీళ్లు, నిప్పు, పొయ్యి, అగ్గిపెట్టె ఉండి, అన్ని సమతూకములో ఉంచి, పొయ్యి వెలిగించి కొంత సమయం ఆగితే అప్పుడు అన్నం తయారౌవుతుంది. అలాగే రుద్రానికి కూడా ఒక విధానాన్ని మహర్షులు మనకందించారు. ఆ విధానములో మనము అభిషేకం ఆచరిస్తే అప్పుడు మనకు తగిన ఫలితం లభిస్తుంది. వేదంలో ఉన్న మంత్రోచ్చారణ సరిగా చేస్తూ, మనస్సును పరమాత్మపై నిలిపి, అందుకు అనుగుణముగా క్రియను చేస్తే అప్పుడు ఫలితం లభించి తీరుతుంది అని పెద్దలు పేర్కొన్నారు.

మంత్రాంతే క్రియః అంటారు. ‘క్షీరేన స్నాపయామి’, అన్నపుడు పాలు పొయ్యాలి, కానీ కొంత మంది పెరుగు పోస్తారు, పొంతమంది నీళ్లు పోస్తారు. అది సరి కాదు. process parameters ని మార్చకుండా, ఆ process మనము follow అయితే result వచ్చి తీరుతుంది.ఎందుకంటే అది వేదం విప్పింది కనుక, అది ఒక సాధారణ విధానముగా నడిచి పోతుంది (Natural Process). మహర్షులు ఈ విధానాన్ని పట్టుకున్నారు కనుక, ఉదాహరణకు నడిచే దేవుడైన శ్రీ కంచి పరమాచార్య స్వామి మనకి మార్గదర్శకతం చేసి చెప్తున్నారు, రుద్రాభిషేకం నిత్యం ఆచరించమని. కనీసముగా సోమవారం నాడు గాని, లేదా ప్రదోష కాలం నాడు గాని, సంవత్సరానికి ఒక్క మాస శివరాత్రినాడు అయినా సరే రుద్రం ఆచరించాలి అని పేర్కొన్నారు. కోరికలు ఉండటం తప్పు కాదు. అవి తీరటానికి మార్గం అభిషేకం. గృహస్థాశ్రమములో కోరికలు ఉండాలి, అవి ధర్మబద్ధముగా ఉండాలి. వాటిని తీర్చుకోవటానికి ఆ దైవాన్ని ఆశ్రయించాలి.

రుద్రంలో ‘నమస్తే రుద్ర మాన్యవ’ అని ఆ పరమేశ్వరుడిని కీర్తిస్తున్నాము. మన్యువు అంటే కోపం. ‘కోపానికి అధిపతి అయిన ఓ రుద్రా నీకు నమస్కారం’, అంటున్నాము. ఎందుకు అంటే అన్ని పాపాలకు మూలం మన కోపం. ‘క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః । స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి’ అని గీతా వాక్కు. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.

కోపం మనిషికి మోహాన్ని కలిగిస్తుంది. మోహము అంటే నిజము కాని దాన్ని నిజము అని భ్రమింప చేయటం. ‘నా భార్య, నా పిల్లలు. నా ఇల్లు’, ఇవేవి నిజము కాదు, ఇవన్నీ అశాశ్వతములే. ‘ధనాని భూమౌ పశవశ్చ గోష్టే నారీ గృహద్వారే, జనః శ్మశానే
దేహాశ్చితాయాం పరలోక మార్గే, కర్మానుగో గచ్ఛతి జీవఏకః’ అంటుంది శాస్త్రం.

ఒకసారి పార్వతిదేవి పరమేశ్వరుడిని తాము స్మశానంలో ఎందుకు నివసిస్తున్నాము అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతి దేవికి ఇలా బదులిస్తాడు, “ఓ పార్వతి, మనిషి ఎప్పుడు వ్యామోహములో చిక్కకొని ఉంటాడు. ఎల్లప్పుడు నేను, నా అనే భావనలో ఉంటాడు. మనిషి మరణించిన తరువాత ఆ చితిని స్మశానానికి తీసుకోని వెళ్ళిన తరువాత, ఆ చితికి కొడుకు నిప్పు పెట్టేదాకా జీవుడిలోని ఆత్మ మాయలో ఉంటుంది. అప్పుడు ఆ ఆత్మకి జ్ఞానోదయం అవుతుంది. సంపాదించిన ధనం భూమిపై ఉండిపోతుంది. పశువులు గోష్ఠంలో మిగిలిపోతాయి. భార్య గృహద్వారం వద్ద ఆగిపోతుంది. బంధుజనులు శ్మశానం వరకూ వస్తారు. దేహం చితిలో కాలిపోతుంది. పరలోకమార్గంలో, జీవుడిని వెన్నంటి వచ్చేది కర్మఫలం, ధర్మం మాత్రమే అని గుర్తుకువచ్చి ఆ జీవుడు విలవిలలాడుతాడు, ఏడుస్తుంటాడు. అప్పుడు ఆ జీవుడిని మన దగ్గిరకు తీసుకుంటాము, వారిని ఓదార్చటానికి మనము స్మశానంలో ఉండాలి.” పరమేశ్వరుడు అంతటి దయామయుడు.

రుద్రపారాయణతో కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎవరైతే నిత్యం రుద్ర పారాయణ చేస్తారో, వారు కోపానికి గురి కారు. వారు కోపానికి లోబడి కాకుండా కోపం వారికి లోబడి ఉంటుంది. ‘కోపము నుబ్బును గర్వము, నాపోవక యునికియును, దురభిమానము నిర్వ్యాపారత్వము ననునివి, కాపురుష గుణంబులండ్రు కౌరవనాథా॥ (మహాభారతం, ఉద్యోగపర్వం: 2-32) – ‘మహాభారతం’లో ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పిన మాటలివి. ‘కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం’ అని మహాభారతములో విదురుడు పేర్కొంటాడు. (విదురనీతి)

కోపం మనిషికి ఉండే సహజ లక్షణం. ఈ లోకములో కోపం లేని వారు ఎవ్వరు ఉండరు. అయితే ఆ కోపాన్ని లోకకల్యాణం కోసం ఉపయోగించగలగాలి. సాక్షాత్తు ధర్మస్వరూపుడైన ఆ శ్రీరాముడికి కూడా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చింది అని రామాయణం పేర్కొంటోంది. అయితే తన కోపాన్ని ధర్మకార్యాల కోసం మాత్రమే శ్రీరాముడు ప్రదర్చించాడు. కోపం రావటం తప్పులేదు. అయితే “ఉత్తమే క్షణిక:కోప: | మధ్యమే ఘటికాద్వయమ్‌ | అధమే స్యాత్‌ అహోరాత్రం | నీచేత్ మరణాన్తక: ||”, ఉత్తముని కోపం క్షణకాలం ఉంటుంది. మధ్యముని కోపం రెండు ఘడియలు (48 నిమిషములు) ఉంటుంది. అధముని కోపం ఒక రోజు ఉంటుంది. కాని, నీచుని కోపం చచ్చేంత వరకూ ఉంటుంది అని శాస్త్రం పేర్కొంటోంది. మన కోపాన్ని నిగ్రహించుకోగలగాలి.

రుద్రములో కోపాన్ని కూడా రుద్ర స్వరూపము అంటున్నాము. అయితే కోపం రుద్ర స్వరూపము ఎలా అయింది? దక్షయజ్ఞం సందర్బములో, దక్షుడు నిరీశ్వర యాగం చేస్తే, ఆ యాగములో దాక్షాయణి అగ్నికి ఆహుతి అయినప్పుడు పరమేశ్వరుడు కోపముతో తాండవం చేసి రుద్రస్వరూపుడైన వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఆ సమయములో దేవతలు స్తోత్రం చేస్తూ, “నమస్తే రుద్ర మన్యవ”, అని పరమేశ్వరుడిని కీర్తిస్తారు. ఎవరైతే ఈ రుద్ర పారాయణ చేస్తుంటారో వాళ్ళకి కోపం నిగ్రహములో ఉంటుంది.

‘నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః’,
‘ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము’, అని ఆ రుద్రుడిని కీర్తిస్తున్నాము. “ఓ రుద్రుడా, నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక, నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక”, అని ఈ శ్లోకార్థముగా మనము భావించవచ్చు. “ఓ రుద్రుడా, నీ కోపాన్ని, బాణాలను నీ భక్తులైన మా మీద కాకుండా, దుష్టుల, దుష్టశక్తుల మీద ప్రయోగించి లోకాలను రక్షించు స్వామి”, అని కూడా ఈ శ్లోకార్థముగా మనము భావించవచ్చు.

‘యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ’, ‘ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము’ అని ఆ రుద్రుడిని కీర్తిస్తున్నాము. నీ యొక్క కోపాన్ని, నీ యొక్క ధనుస్సు, బాణాలను మాకు మంగళకరమైన దానిగా మార్చు స్వామి ఆ పరమేశ్వరుడిని కీర్తిస్తున్నాము.

ఇక్కడ ఒక ఉదాహరణను పరిశీలిద్దాము. ఒకానొక ప్రాంతములో వర్షము పడవచ్చు, మరొక ప్రాంతములో వర్షము పడకపోవచ్చు. ఎక్కడ ఏది అవసరమో, అక్కడ దాన్ని అనుగ్రహించేవాడే పరమేశ్వరుడు. ఒక్క మనుష్యులకు మాత్రమే మేలు చేకూర్చే విధముగా ఈశ్వరుడు చేయడు, 84 లక్షల ప్రాణకోటికి మేలుచేసేవాడే ఈశ్వరుడు. ‘స్థావర జంగములు’, సకల చరాచర జగత్తును పోషించేవాడు ఈశ్వరుడు. ‘నమో॒ వర్ష్యా॑య చావ॒ర్ష్యాయ॑ చ॒ నమో॑ మే॒ఘ్యా॑య చ విద్యు॒త్యా॑య చ॒’, ‘ఓ రుద్రా నీవు వర్ష స్వరూపుడివి, నీవే అవర్ష స్వరూపుడివి, నీవే మేఘ స్వరూపుడివి, నీవే విద్యుత్ స్వరూపుడివి’, అని ఆ రుద్రుడిని కీర్తిస్తున్నాము. అన్ని రూపములలో ఉన్న ఈశ్వర తత్వానికి మనము నమస్కారం చేస్తున్నాము.

‘నమో అగ్రియాయచ ప్రథమాయచ’ – జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో ముఖ్యుఁడును అగు పరమ శివునకు నమస్కారము. ‘నమః పూర్వజాయ చా పరజాయ చ’ – జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్టి జగ దవసాన సమయమున అగ్ని రూపమున జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము అని ఆ ఈశ్వరుని కీర్తిస్తున్నాము. అందరిలో ఉన్న ఈశ్వర తత్వానికి నమస్కరిస్తున్నాము.

రుద్రం యొక్క సారాంశం ఏమిటి?

‘యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు’, ‘అగ్ని, నీరు మున్నగు పంచభూతాలలో, ఓషధులు, విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము’, అని ఆ ఈశ్వరుని కీర్తిస్తున్నాము. ఆ పరమేశ్వరుడే పంచభూతముల రూపములో సమస్త జగత్తును రక్షిస్తున్నాడు. ఈ విషయమునే పోతన గారు భగవతములో వివరిస్తూ, “కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం గల, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్”, అని పేర్కొంటారు.

భగవంతుడైన విష్టువు లేనిచోటు విశ్వంలో లేదు. సముద్రంలో, ఆకాశంలో, అవని యందు అగ్నిలో, అన్నిదిశాల ఉన్నాడు. రాత్రియందు, పగటి యందు, సూర్య, చంద్రులందు, ఓంకారమందున్నాడు. త్రిమూర్తులలో, స్త్రీ, పురుష, నపుంసకులందు, అక్కడ, ఇక్కడాని ఏమి సర్వేశ్వరుడు అంతటా నిండి యున్నాడని ఈ పద్యభావం.

ఇలా ఒక్కొక మంత్రము ఈశ్వరుడి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. రుద్రం మనము చెప్పేదేమిటి? ఈశ్వర తత్వము సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందిన ఈశ్వర తత్వాన్ని (ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర- జ్జ్యోతిః – పాతాళలోకము నుంచి బ్రహ్మాండము దాకా) లింగ రూపములో మనము ఆరాధిస్తున్నాము. మన గురించి ఇతరులకు ఎవరైనా చెప్పాలంటే వారు మన ఫోటో చూపిస్తారు లేదా పేరు చెప్తారు. ఆలా symbolic గా ఒక లింగ రూపములో ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తున్నాము.

మనము ఇంట్లో పుజించే శివ లింగం అంగుష్ఠ మాత్రం ఉండాలని శాస్త్ర వచనం. రుద్రం రాని వారు ‘ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ మహదేవాయ త్రయంబకయ త్రిపురాంతకయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని – రుద్రయా నీలకంటాయ మృత్యుంజయాయ సర్వేస్వరాయ సధశివాయ శ్రిమన్ మహా దెవాయ నమః’, అని కీర్తిస్తూ ఆ ఈశ్వరుడిని మనము అభిషేకిస్తాము. అది కూడా రాని వారు “ఓం నమః శివాయ” అని స్మరిస్తూ శివలింగం మీద నీరు పోయవచ్చు. అది కూడా రాని వారు “శివాయనమః” అని స్మరిస్తూ శివలింగం మీద నీరు పోయవచ్చు. అది కూడా రాని వారు శివలింగం మీద నీరు పోసినా చాలు, అభిషేకం చేసినట్లే అని శాస్త్రం పేర్కొంటోది. సనాతన ధర్మం మనము అంత వెసలుబాటును అందించింది.

చమకం అంటే?

నమకం చదివిన తరువాత మనము చమకం చదువుతాము. చమకం అంటే మనకు కావాల్సినదేమిటి అని ఆ ఈశ్వరుని కోరుకోవటం. చమకం చదివితే ఇక ఆ ఈశ్వరుని ఏమో అడగక్కర్లేదు. మనము ఏమి కావాలో అంతా చమకంలో పేర్కొనబడ్డది. మనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. ‘జైష్ఠ్యం’ చ మ ఆధి’పత్యం చ మే మన్యుశ్చ’ మే భామ’శ్చ మే‌உమ’శ్చ మే‌உమ్భ’శ్చ మే జేమా చ’ మే…’ – ‘నేను రుద్రుని అర్చించుట వలన – ఆహారము, దాన్ని ఇచ్చే మనసు, ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం… నాలో ఉండు గాక’, అని చమకంలో ఆ ఈశ్వరుడిని వేడుకుంటాము.

నమకము అంతా ఆ ఈశ్వరుని స్తోత్రం చెయ్యటం, చమకం అంతా ఆ ఈశ్వరుని మన కోరికలను అడగటం. ఈ రెండు చేస్తే, నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకవారం, 11 సార్లు చేస్తే ఏకాదశం అంటున్నాము. 11 సార్లు అభిషేకం చెయ్యటం ఎందుకు విశిష్టత అంటే, మనిషి జీవితాన్ని నడిపించేవి పంచేంద్రియాలు (5) + కర్మేంద్రియాలు (5) + ఆత్మ. త్వక్ (చర్మం), చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము (ముక్కు) మన పంచేంద్రియాలు. ఈ ప్రపంచాన్ని మనము దేనితో లోపలికి లాగుతున్నాము? కళ్ళతో, చెవులతో, నాసికతో అంటే ఇంద్రియాలతో లాగుతున్నాము.

ఇవి చూడటం, వినడం, వాసన చూడటం, రుచి చూడటం మరియు స్పర్శ జ్ఞానాన్ని అందిస్తాయి. వాక్పాణిపాదపాయూపస్థాఖ్యాని కర్మేంద్రియాణి అన్నారు, వాక్కు (నోరు), చేతులు, పాదములు, పాయువు (మల విసర్జనేంద్రియము), ఉవస్థ (మూత్ర విసర్జనేంద్రియము) కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాల ద్వారా మనం అనేక కర్మలను చేస్తూ ఉంటాము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సంయమనంతో నడుస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేక రకాలైన భోగాలను అనుభవిస్తుంటాడు.

ఏకాదశ రుద్రం యొక్క విశిష్టత.

11 వది ఆత్మ. అదే శ్రిమన్ మహా దెవాయ నమః (ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ.. ను పదవిభజన చేస్తే 11 పదాలు వస్తాయి. అందులో చివరిది శ్రిమన్ మహా దెవాయ నమః) ఆత్మ స్వరూపమే ఆంజనేయులవారు, పరమాత్మ స్వరూపమే శ్రీరాములవారు. రామాయణాన్ని రాముడు, ఆంజనేయుడు నడిపించినట్లే మన రామాయణము నడవాలంటే ఈ 11 అనుసంధానం కావలిసి ఉంటుంది, అదే ఏకాదశ రుద్రం యొక్క విశిష్టత.

11 ఏకాదశ రుద్రాలు చేస్తే ఒక లఘు రుద్రం. 11 లఘు రుద్రం చేస్తే ఒక మహా రుద్రం. 11 మహా రుద్రాలు చేస్తే ఒక అతి రుద్రం. మనకు ఎంత శక్తి ఉంటే ఆంత చెయ్యాలి అంటుంది శాస్త్రం. శ్రీరుద్రంతో జప, హోమ, అభిషేకం, అర్చన చెయ్యవచ్చు అని శాస్త్రం పేర్కొంటోంది. రుద్రాభిషేకమే కాకుండా రుద్ర పారాయణ కూడా విశేష ఫలితాలను మనకందిస్తుంది. వీటిల్లో ఏ విధానముతోనైనా మనము ఆ పరమేశ్వరుడిని అర్చించవచ్చు. ఇది ఇలా అనంతముగా సాగుతూ ఉంటుంది. మహార్సులు అందించిన పంచాక్షరీ అతి విశిష్టమైనది. ఈశ్వర తత్వము అనంతమైనది, సర్వ వ్యాకమైనటువంటిది, సర్వశక్తిమైనటువంటిది, అయిన యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ప్రసరించాలని ఆశిస్తూ, ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy